అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకిడే

పయనించే సూర్యుడు మార్చి 8 కరీంనగర్ న్యూస్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ అశ్విని తానాజీ వాకిడే మాట్లాడుతూ మహిళల పాత్ర సమాజ అభివృద్ధిలో అత్యంత కీలకమని పేర్కొన్నారు. తాను ఈ స్థాయికి చేరుకోవడానికి తన తల్లి ఇచ్చిన ప్రేరణే కారణమని తెలిపారు. “అమ్మ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాను కాబట్టే మొదటగా డాక్టర్ అయ్యాను తర్వాత ఐఏఎస్ అయ్యాను. అమ్మే నా మొదటి గురువు” అని పేర్కొన్నారు. నవోదయ పాఠశాలలో తన విద్యాభ్యాసం ప్రారంభమైందని, తల్లి ఇచ్చిన విలువలు మరియు క్రమశిక్షణే జీవితంలో ఉన్నత స్థాయికి తీసుకువచ్చాయని ఆమె పేర్కొన్నారు. తల్లి చదువుకోకపోయినా తనను బలంగా చదివించి ఈ స్థాయికి తీసుకువచ్చిందని భావోద్వేగంతో తెలిపారు. భవిష్యత్తులో తల్లి చెప్పిన పాఠాలను పాటించే వారు జీవితంలో తప్పకుండా ముందుకు సాగుతారని ఆమె అన్నారు. అనంతరం మహిళా ఉద్యోగులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్, టీఎన్జీవోల జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మహిళా దినోత్సవ ప్రాముఖ్యతను వివరించారు. “యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః” అని మన భారతీయ సంస్కృతి చెబుతుందని, స్త్రీలను గౌరవించే చోటే దేవతలు వాసం చేస్తారని ఆయన అన్నారు. మహిళలకు మన సంస్కృతిలో ఎంతో గొప్ప స్థానం ఉందని పేర్కొన్నారు. ఒకప్పుడు మహిళలు అనేక అన్యాయాలు, అవమానాలు ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. చిన్నపిల్లలకు పాలివ్వడానికి వెళ్లిన తల్లులకు పని గంటల్లో కోత విధించి జీతాలు తగ్గించిన సందర్భాలు కూడా ఉండేవని తెలిపారు. భ్రూణహత్యలు వంటి దారుణ సంఘటనలు కూడా సమాజంలో చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. అయితే అలాంటి పరిస్థితులకు వ్యతిరేకంగా మహిళలు చేసిన పోరాటాల ఫలితంగానే నేడు వారికి రక్షణగా అనేక చట్టాలు అమల్లోకి వచ్చాయని చెప్పారు. ప్రస్తుతం మహిళలకు మేటర్నిటీ లీవ్, పీటర్నిటీ లీవ్, చైల్డ్ కేర్ లీవ్, హెల్త్ కేర్ లీవ్ వంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించబడుతున్నాయని తెలిపారు. నేడు మహిళలు అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు, డాక్టర్ నుంచి ఇంజనీర్ వరకు, రక్షణ రంగం నుంచి పరిపాలనా రంగం వరకు ప్రతి రంగంలో పురుషులకు దీటుగా ముందుకు సాగుతున్నారని అన్నారు. “శ్రీలు అందులేరు ఇందులేరు అనే సందేహము వలదు – ఎందెందు చూసినా అందందు కలరు” అన్నట్లుగా నేడు ప్రతి రంగంలో మహిళల ప్రతిభ వెలుగుతోందని పేర్కొన్నారు. మన సంస్కృతిలో స్త్రీ స్థానం ఎంతో గొప్పదని, “కార్యేషు దాసి – కరణేషు మంత్రి – భోజ్యేషు మాతా” అనే సూక్తి ద్వారా స్త్రీ కుటుంబంలోనూ, సమాజంలోనూ అనేక బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తుందని వివరించారు. కుటుంబ బాధ్యతలతో పాటు ఉద్యోగ బాధ్యతలను కూడా సమర్థంగా నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగులను ప్రోత్సహించేందుకు మహిళా దినోత్సవ వేడుకలు, ఆటల పోటీలు నిర్వహించేందుకు అనుమతి ఇచ్చిన జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అలాగే ముఖ్య అతిథిగా హాజరైన అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకిడే ఐఏఎస్ తెలంగాణ ఎంప్లాయిస్ జేఏసీ – టీఎన్జీవోల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. చివరిగా ఆయన మాట్లాడుతూ “స్త్రీలను పుట్టనిద్దాం బ్రతకనిద్దాం వారికి బంగారు భవిష్యత్తు ఇవ్వుదాం” అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్వో డా. వెంకటరమణ, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ అధికారి సరస్వతి, సంఘం నాయకులు లక్ష్మణరావు, శారద, సబిత, సునీత, సరిత, విజయలక్ష్మి, హరిప్రియ, సుస్మిత, శైలజ, ముప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి, ఒంటెల రవీందర్ రెడ్డి, రాగి శ్రీనివాస్, సర్దార్ హర్విందర్ సింగ్, పోలు కిషన్, కోట రామస్వామి, శంకరయ్య, గంగారపు రమేష్, రాజేశ్వరరావు, సూర్యశ్రీ, లతా, రాధిక, విజయలక్ష్మి, వీణ, స్వర్ణలత, జ్యోతి శ్రీ, ధనలక్ష్మి, లలిత, మేరీ తదితరులు పాల్గొన్నారు. అలాగే కమలాకర్, కరుణాకర్, అస్గర్, రాజేష్, భరద్వాజ్, రాజేష్ సాయి తదితర వివిధ శాఖల అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 300 మంది మహిళా ఉద్యోగులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.