ఆర్టిజన్ కార్మికుల సమస్యల పరిష్కారానికి మార్చి 10న ధర్నా

* టీ ఈ ఈ 1104 యూనియన్ సంపూర్ణ మద్దతు

పయనించే సూర్యుడు, మార్చి 8 – నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి, రిపోర్టర్: కె. శ్రావణ్ కుమార్ విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీవీఏఈజేఏసీ) ఆధ్వర్యంలో మార్చి 10, 2026న టీజీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం ఎదుట నిర్వహించనున్న ధర్నా కార్యక్రమానికి టీ ఈ ఈ 1104 యూనియన్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ విషయాన్ని టీజీఎస్పీడీసీఎల్ కంపెనీ ఆర్గనైజింగ్ సెక్రటరీ (టీ ఈ ఈ 1104 యూనియన్) కొంకలి లోకేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ యూనియన్‌పై నమ్మకం ఉంచి ఓర్పుతో తమ విధులను నిర్వర్తిస్తున్నారని చెప్పారు. కార్మికుల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణ కోసం యూనియన్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు నిర్వహించనున్న ఈ ధర్నా కార్యక్రమానికి టీ ఈ ఈ 1104 యూనియన్ పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఆర్టిజన్ కార్మికుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి వెళ్లి త్వరితగతిన పరిష్కారం కావాలంటే కార్మికులంతా ఐక్యంగా ఉద్యమంలో పాల్గొనాల్సిన అవసరం ఉందన్నారు. మార్చి 10న నిర్వహించనున్న ఈ ధర్నాలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1104 ఆర్టిజన్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్మికుల ఐక్యతతోనే సమస్యలకు పరిష్కారం సాధ్యమవుతుందని, భవిష్యత్తులో కూడా కార్మికుల హక్కుల సాధన కోసం పోరాటాలు కొనసాగుతాయని కొంకలి లోకేష్ స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *