కొత్త కారు కొనుగోలు చేసిన వినియోగదారుడికి కష్టాల పరంపర

★ సాంకేతిక లోపంతో నిలిచిపోయిన వాహనం, పట్టించుకోని షోరూం యాజమాన్యం

పయనించే సూర్యడు / మార్చ్ 08/ ఉప్పల్ ప్రతినిధి సింగం రాజు కుషాయిగూడ ప్రాంతంలో ఉన్న ఒక ప్రముఖ కారు విక్రయ కేంద్రం వద్ద వినియోగదారుడికి అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ బాధితుడు ఆందోళన వ్యక్తం చేశాడు. కొత్తగా కొనుగోలు చేసిన తన వాహనం సాంకేతిక లోపాలతో తరచూ సమస్యలు కలిగిస్తోందని, దాన్ని మరమ్మతుల కోసం విక్రయ కేంద్రానికి తీసుకెళ్లినప్పటికీ అక్కడి సిబ్బంది సరైన స్పందన ఇవ్వలేదని ఆయన వాపోయాడు. బాధితుడి వివరాల ప్రకారం, ఇటీవల కొనుగోలు చేసిన వాహనం కొద్ది రోజులకే పనిచేయడంలో సమస్యలు ఎదురవ్వడం ప్రారంభమయ్యాయి. ఈ సమస్యల కారణంగా వాహనాన్ని మరమ్మతుల కోసం కుషాయిగూడలోని విక్రయ కేంద్రానికి అప్పగించినట్లు తెలిపారు. అయితే వాహనం అప్పగించి పదిహేను రోజులు గడిచినా ఇంకా తిరిగి ఇవ్వలేదని, సమస్య ఏమిటో కూడా స్పష్టంగా చెప్పకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించాడు. ఇప్పటికే పదిహేను రోజులుగా వాహనం లేక ఇబ్బందులు పడుతున్నామని, రోజువారీ పనులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని బాధితుడు తెలిపాడు. పలుమార్లు విక్రయ కేంద్రం సిబ్బందిని సంప్రదించినప్పటికీ సరైన సమాధానం ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని అన్నారు.ఈ విషయంపై బాధితుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, తాను కొనుగోలు చేసిన వాహనానికి సంబంధించిన సమస్యను వెంటనే పరిష్కరించి న్యాయం చేయాలని సంబంధిత సంస్థ యాజమాన్యాన్ని కోరాడు. వినియోగదారుల సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం సరైంది కాదని, తక్షణమే స్పందించి తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు. స్థానికులు కూడా వినియోగదారుడి సమస్యపై స్పందిస్తూ, ప్రజలు నమ్మకంతో కొనుగోలు చేసే వాహనాల విషయంలో సంస్థలు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. సమస్య త్వరగా పరిష్కరించాలని వారు కోరుతున్నారు.