చిన్న మాసంపల్లి రైతు వేదికలో సమగ్ర భూ భారతి భూ రీ సర్వే అవగాహన సదస్సు

★ "సభలో మాట్లాడుతున్న భూ సర్వేయర్ ఏడి. అధికారి .ఆర్ .సుదర్శన్" ★ "సిద్దిపేట జిల్లాలో రెండవ పైలట్ గ్రామంగా చిన్న మాసన్ పల్లి ఎంపిక"

పయనించే సూర్యుడు మార్చి 8 దౌల్తాబాద్ రాజేష్) రాయపోల్ మండలం చిన్న మాసంపల్లి గ్రామ రైతు వేదికలో సిద్ధిపేట జిల్లా స్థాయి సమగ్ర భూ భారతి భూ రీ సర్వే అవగాహన సదస్సు ఈ రోజు నిర్వహించబడింది. జిల్లాలో రెండవ పైలెట్ గ్రామంగా చిన్న మాసంపల్లిని ఎంపిక చేసి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా భూ సర్వేయర్ ఏడి.అధికారి ఆర్. సుదర్శన్ మాట్లాడుతూ రైతులు భూ సర్వే కార్యక్రమాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గతంలో లేని విధంగా ఈసారి పూర్తిస్థాయిలో డిజిటల్ పద్ధతిలో భూ సర్వే నిర్వహించబడుతోందని తెలిపారు. పాత రికార్డుల్లో ఉన్న భూ వివాదాలు, సమస్యలను పరిష్కరించి భూమి వివరాలను పూర్తిగా డిజిటల్ రూపంలో నమోదు చేసి ప్రభుత్వం రైతులకు డిజిటల్ ల్యాండ్ కార్డులను అందించే దిశగా చర్యలు తీసుకుంటోందని చెప్పారు. దీంతో భవిష్యత్తులో భూ రికార్డులపై ఎలాంటి అనుమానాలు లేదా తప్పుడు నమోదు జరగకుండా పారదర్శకమైన వ్యవస్థ ఏర్పడుతుందని, ఈ సర్వే రైతులకు ఒక కొత్త భరోసా కల్పిస్తుందని తెలిపారు. రాయపోల్ మండల ఎమ్మార్వో అధికారి కృష్ణ మోహన్ మాట్లాడుతూ గతంలో ఉన్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఈ సమగ్ర భూ రీ సర్వే ఎంతో ఉపయోగకరమని అన్నారు. ప్రభుత్వం క్రమబద్ధమైన విధానంలో పూర్తి స్థాయి డిజిటల్ సర్వే నిర్వహించి భూ రికార్డులను డిజిటల్ కార్డుల రూపంలో అందించేందుకు నిర్ణయం తీసుకోవడం సంతోషకరమని పేర్కొన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ భూ వివరాలను సరిచేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ శ్రీనివాస్, ఏపిఎం.యాదగిరి, అడిషనల్ ఏడి.శ్రీనివాస్, చిన్న మాసంపల్లి సర్పంచ్ రేకుల నరసింహారెడ్డి, ఉప సర్పంచ్ సొక్కం భారతమ్మతో పాటు రాయపోల్ మండలంలోని వివిధ గ్రామాల జిపిఓ లు, ఏ ఈ ఓ.లు మరియు రైతులు పాల్గొన్నారు