పయనించే సూర్యుడు మార్చి 8 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు) తిరుపతి జిల్లా ఓజిలి మండల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్‌పై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఎస్సై కే. శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించిన తనిఖీలలో మద్యం సేవించి వాహనాలు నడిపిన ఐదుగురిని గుర్తించి కేసులు నమోదు చేశారు. అనంతరం నిందితులను శనివారం నాయుడుపేట కోర్టులో హాజరు పరిచారు. కేసును విచారించిన జడ్జి మీనాక్షి నిందితులైన ఐదుగురికి ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున జరిమానా విధించారు. దీంతో మొత్తం రూ.50 వేల జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో కోర్టు కఠినంగా స్పందించినట్లు వెల్లడించారు. ఇకపై మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోసారి ఇలాంటి నేరంలో పట్టుబడితే జైలు శిక్ష తప్పదని జడ్జి మీనాక్షి నిందితులను గట్టిగా హెచ్చరించినట్లు ఎస్సై కే. శ్రీకాంత్ తెలిపారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితంగా ప్రయాణించాలని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌పై తనిఖీలు కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు.