పయనించే సూర్యడు ప్రతినిది సాగర్ మర్చి.09.2026 దేవీపట్నం మండలానికి చెందిన ఒక మైనార్టీ కుటుంబంలో ఇద్దరు చిన్నారులు జన్యు లోపంతో తీవ్రంగా బాధపడుతూ. మంచానికే పరిమితమవడం హృదయ విదారక ఘటనగా మారింది. సరైన వైద్యం అందక కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతో ఈ సమస్యను రంపచోడవరం ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి దృష్టికి తీసుకువెళ్లారు. దేవీపట్నం మండలానికి చెందిన షేక్ సయ్యద్ అలీ కుటుంబానికి చెందిన ఇద్దరు కుమారులు షేక్ అప్సర్(14), సైఫూల్(12) చిన్న వయసులోనే జన్యు లోపంతో బాధపడుతున్నారు. ఈ వ్యాధి కారణంగా ఇద్దరు చిన్నారులు నడవలేక చాలా కాలంగా మంచానికే పరిమితమయ్యారు. రోజువారీ అవసరాలు కూడా కుటుంబ సభ్యుల సహాయంతోనే కొనసాగుతున్నాయి. ఆర్థికంగా బలహీనమైన ఈ కుటుంబం పిల్లలకు సరైన వైద్యం అందించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ చికిత్స ఖర్చులు భరించలేక తీవ్ర ఇబ్బందులు పడుతోంది.చిన్నారుల పరిస్థితి రోజు రోజుకూ ఆందోళనకరంగా మారుతుండటంతో కుటుంబ సభ్యులు,స్థానిక నాయకుల సహకారంతో వారిని రంపచోడవరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి తీసుకువెళ్లి వారి పరిస్థితిని వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి చిన్నారులను చూసి వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. పిల్లల పరిస్థితి పట్ల చలించిపోయిన ఆమె వెంటనే స్పందించి సంబంధిత ఉన్నతాధికారులకు నివేదిక పంపించి వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా కుటుంబానికి సహాయం అందేలా చూస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని రాష్ట్ర దూదేకుల కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ సుభాని, దేవీపట్నం మండల స్థానిక నాయకులు, ఎల్లో సింగం జిల్లా ఇంచార్జి కేసవరపు చంద్రకుమార్ (పండు), మరియు ఏఎంసీ డైరెక్టర్ జొన్నల రాంబాబు కలిసి చిన్నారులను ఎమ్మెల్యే వద్దకు తీసుకువెళ్లి సమస్యను వివరించారు. చిన్నారుల పరిస్థితి చూసి స్థానికులు చలించిపోతున్నారు. ప్రభుత్వం మరియు దాతలు ముందుకు వచ్చి ఈ కుటుంబానికి సహాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు.