పయనించే సూర్యుడు మార్చి 9 నాగర్కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం పాలెం గ్రామంలో తెలంగాణ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ ఆధ్వర్యంలో మహిళా సమావేశం నిర్వహించారు. మహిళల హక్కుల సాధన, గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సమాజంలో మహిళలపై రోజురోజుకు పెరుగుతున్న దాడులు, అరాచకాలు, దౌర్జన్యాలు ఆందోళనకరమని పేర్కొన్నారు. మహిళల భద్రత, ఆర్థిక స్థిరత్వం కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ తరఫున పలు ముఖ్య డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేశారు. భూమిలేని దళిత, ఆదివాసీ కుటుంబాలకు చెందిన మహిళలకు ఐదు ఎకరాల వ్యవసాయ భూమిని పంపిణీ చేయాలని, 55 సంవత్సరాలు నిండిన మహిళలకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు నెలకు రూ.5000 పింఛన్ ఇవ్వాలని కోరారు. మహిళా కూలీలకు పురుషులతో సమానంగా కనీస వేతనం చట్ట ప్రకారం రోజుకు రూ.850 చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే ఉపాధి హామీ చట్టంలో కుటుంబానికి కాకుండా ప్రతి ఒక్కరికి వేర్వేరుగా జాబ్ కార్డు ఇవ్వాలని, సంవత్సరానికి 200 రోజుల పని కల్పించాలని పేర్కొన్నారు. మహిళలపై అత్యాచారాలు, గృహహింస, పని ప్రదేశాల్లో వేధింపులు జరిగిన సందర్భాల్లో నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు తక్షణ నష్టపరిహారం అందించాలని కోరారు. కార్మికులందరికీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వారి పేర్లను నమోదు చేయాలని, గర్భిణీ మహిళలకు ఆరు నెలల కాలానికి రూ.50 వేల ఆర్థిక సాయం అందించాలని, అంగవైకల్యం లేదా మరణం సంభవించినప్పుడు కనీసం రూ.5 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే కార్మికులను ఈఎస్ఐ ఆరోగ్య సేవలకు అనుసంధానం చేయాలని తెలిపారు. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి నెలంతా గ్రామ గ్రామాన ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ మహిళల మానవ హక్కులు, ఆర్థిక స్వావలంబన కోసం పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి పార్టీ, ప్రతి అభ్యర్థిని మహిళల డిమాండ్లపై ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ జిల్లా కోఆర్డినేటర్ కె. తిరుపతయ్య, మహిళా కోఆర్డినేటర్ ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.