పయనించే సూర్యుడు మార్చి 10, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని మండలం అనంతసాగర్ గ్రామానికి చెందిన డాక్టర్ లక్ష్మీకాంతమ్మ కు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో “ ఉమెన్ ఆఫ్ ఎక్సలెంట్ అవార్డు ” ప్రదానం చేయడం జరిగింది .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హర్యానా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల మాజీ గవర్నర్ మరియు భారత ప్రభుత్వ మాజీ కేంద్ర మంత్రిగా సేవలందించిన బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. ప్రత్యేక అతిథిగా ఇండో కెనడియన్ యూత్ కౌన్సిల్ బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ రొయ్యూరు శేషసాయి పాల్గొన్నారు.సభకు అధ్యక్షతను పుడమి సాహితీ వేదిక స్థాపకుడు, కళారత్న డాక్టర్ చిలుముల బాల్ రెడ్డి వహించారు. గౌరవ అతిథులుగా ఎన్ఐడిసి నేషనల్ చైర్మన్ యామినేని ఉప్పలరావు, నల్గొండ జిల్లా టిటిడి బోర్డు మాజీ సభ్యుడు ధరావత్ బాల్స్ నాయక్, గిన్నిస్ బుక్ రికార్డు హోల్డర్ మరియు విద్యా విశ్లేషకుడు బాలరాజు ముద్దాడ పాల్గొన్నారు.ఈ సందర్భంగా సమాజానికి అందిస్తున్న సేవలకు గుర్తింపుగా డాక్టర్ పత్తిపాటి లక్ష్మీకాంతమ్మకు అతిథుల చేతుల మీదుగా “ఉమెన్ ఆఫ్ ఎక్సలెంట్ అవార్డు” అందజేశారు.అవార్డు స్వీకరించిన అనంతరం డాక్టర్ లక్ష్మీకాంతమ్మ మాట్లాడుతూ మహిళ తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని అన్నారు. సృష్టికి జీవం పోసింది మహిళేనని, మహిళ లేకుండా ఈ ప్రపంచం లేదని పేర్కొన్నారు. ఒక తల్లిగా, భార్యగా, బిడ్డగా, అక్కగా, చెల్లిగా ఎన్నో పాత్రలు పోషిస్తున్న మహిళలను సమాజం గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు.అలాగే సమాజంలో చిన్నారుల నుండి వృద్ధుల వరకు మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు ఆందోళనకరమని, మహిళలను గౌరవించే సంస్కారం ప్రతి ఒక్కరిలో రావాలని సూచించారు.మహిళల విలువను తెలియజేస్తూ ఒక చైతన్య గీతాన్ని ఆలపించి అందరినీ ఆకట్టుకున్నారు.స్త్రీలను గౌరవిద్దాం, వారిని రక్షిద్దాం అనే సందేశాన్ని సమాజానికి అందిస్తూ ఈ అవార్డు అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందని డాక్టర్ లక్ష్మీకాంతమ్మ తెలిపారు.