
పయనించే సూర్యుడు, మార్చి 10, బచ్చన్నపేట మండల ప్రతినిధి: నీల పవన్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బచ్చన్నపేట మండలంలోని తమ్మడపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గల ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పర్యవేక్షించారు. పాఠశాల నిర్వహణ, విద్యార్థుల హాజరు, బోధన విధానాలను పరిశీలించారు. తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడి, వారికి పాఠాలు బోధించారు. ఉపాధ్యాయులతో మాట్లాడి బోధనలో నాణ్యతను మెరుగుపరచాలని సూచించారు. అలాగే పాఠశాలలో అందిస్తున్న మధ్యాహ్న భోజనం విషయంలో పరిశుభ్రత పాటించాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం గ్రామంలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనుల పురోగతిని తెలుసుకొని ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. అదే విధంగా లబ్ధిదారులతో మాట్లాడి త్వరగా నిర్మాణాలు పూర్తి చేసుకొని ఉగాది పండుగకు గృహ ప్రవేశం చేయాలని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నాణ్యతతో ఇళ్ల నిర్మాణం జరగాలని, పనులు ఆలస్యం కాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. తదనంతరం అదే గ్రామ పంచాయతీలోని రోడ్లపై పేరుకుపోయిన చెత్తను తొలగించే పనులను కలెక్టర్ పరిశీలించారు. రోడ్లపై చెత్త పేరుకుపోకుండా ప్రతి రోజూ శుభ్రంగా ఉంచాలని సంబంధిత అధికారులకు సూచించారు. చెత్తను సమయానికి సేకరించి డంపింగ్ యార్డులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. అనంతరం గ్రామ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం, గుడ్లు, పాలు వంటి పోషకాహార పంపిణీ విధానాన్ని పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రంలో పిల్లల హాజరు, ఆరోగ్య పరీక్షలు, బరువు, ఎత్తు నమోదు వంటి అంశాలను కూడా కలెక్టర్ తనిఖీ చేశారు. అలాగే తానే స్వయంగా చిన్నారుల బరువును తూగి, ఎత్తును కొలిచారు. గర్భిణీలు, బాలింతలకు అందిస్తున్న పోషకాహారంపై అధికారులను అడిగి తెలుసుకొని, సేవలు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తదనంతరం జిల్లాలోని బచ్చన్నపేట మండలంలో ప్రజల ఇళ్లకు వెళ్లి ఆకస్మిక సందర్శన చేశారు. వారితో మాట్లాడి, పరిసరాలను నిరంతరం పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చెత్తను రోడ్లపై వేయకుండా, నిర్ణయించిన చెత్త సేకరణ కేంద్రాలకు ఇవ్వాలని, అదే విధంగా నీటి తొట్టెలపై మూతలు తప్పనిసరిగా పెట్టుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.ఈ పరిశీలనలో డీపీఓ వసంత, హౌసింగ్ పీడీ మాతృ నాయక్, డీఎల్పీఓ వెంకట్ రెడ్డి, ఎంపిడిఓ మమతా బాయి, ఎంపీఓ శ్రీనాథ్ రెడ్డి, సర్పంచ్ బెజాడి సిద్ధులు పంచాయతీ కార్యదర్శి సౌజన్య, ఇతర సంబంధిత అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.