పయనించే సూర్యుడు మార్చి 10 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఖమ్మం: ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో ఉన్న భర్తను పథకం ప్రకారం కారుతో ఢీకొట్టించి హత్య చేయించిన ఘటన ఖమ్మం పట్టణంలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం పట్టణంలోని గాంధీనగర్ ప్రాంతానికి చెందిన చాగంటి రవి, ప్రశాంతి దంపతులు 20 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రవి ఆటో డ్రైవర్‌గా పని చేస్తూ మద్యానికి బానిసై అనారోగ్యానికి గురయ్యాడు. భర్త త్వరలోనే మృతి చెందుతాడని భావించిన ప్రశాంతి గత జూలై నెలలో అతని పేరుపై రూ.66 లక్షల ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నట్లు సమాచారం. అయితే తొమ్మిది నెలలు గడిచినా రవి మరణించకపోవడంతో ఇన్సూరెన్స్ డబ్బులు పొందేందుకు ప్రశాంతి పథకం రచించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నెల 2వ తేదీన రవికి మద్యం తాగించి మత్తులో ఉండగా, తన బావమరిది శ్రీనివాస్ సాయంతో కారుతో ఢీకొట్టించి హత్య చేయించినట్లు విచారణలో బయటపడింది. రవి మరణంపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు ప్రశాంతిని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.