పయనించే సూర్యుడు మార్చి 10 : ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఈ సభల విజయానికి తోడ్పడిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపిన చైతన్య రాజు కిమ్స్ ప్రాంగణంలో 3వ ప్రపంచ తెలుగు మహా సభల విజయోత్సవ సభ ఘనంగా జరిగింది. ఫిబ్రవరి 28 వ తేదీ స్థిర వారం మరియు మర్చి 1 వ తేదీ ఆదివారం, రెండు రోజుల పాటు అమలాపురం కిమ్స్ వైద్య కళాశాల ప్రాంగణంలో ౩వ ప్రపంచ తెలుగు మహా సభలు ఘనంగా జరిగాయని, రెండు తెలుగు రాష్ట్రాలనుండే కాక దేశ విదేశాల లోని అనేక మంది తెలుగు వారి నుండి విశేష స్పందన లభించిందని, సుమారు 50 వేల మందికి పైగా హాజరై ఈ సభలను విజయవంతం చేయడం చాలా సంతోషించదగిన విషయమని, ఈ ప్రపంచ తెలుగు మహా సభల నిర్వాహకులు, కిమ్స్ మరియు చైతన్య విద్యా సంస్థల స్థాపకులు మరియు చైర్మన్, మాజీ శాసన మండలి సభ్యులు మరియు గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ ఛాన్సలర్ కె.వి.వి సత్యనారాయణ రాజు చైతన్య రాజు తెలిపారు. ఈ రెండు రోజుల కార్యక్రమాలకు విచ్చేసిన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా మరియు ఒరిస్సా రాష్ట్రాల గవర్నర్లు, అనేక మంది న్యాయ మూర్తులు, కేంద్ర మరియు రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, ప్రభుత్వ అధికారులు, పోలీసు అధికారులు, పాత్రికేయులు, ఉపాధ్యాయులు, రాష్ట్రం నలు మూలల నుండి కవులు, తెలుగు భాషాభిమానులకు; పోటీలు నిర్వహించుటలో మూడు నెలల పాటు తోడుగా ఉన్న తెలుగు పండితులకు, మరియు ముందుండి ఈ కార్యక్రమాలను నిర్వహించిన కిమ్స్ మరియు గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ సిబ్బందికి, ఈ ప్రపంచ మహా సభలను విజయవంతం చేయడంలో భాగస్వాములైన వారందరికీ పేరు పేరునా కె.వి.వి సత్యనారాయణ రాజు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. తెలుగు భాషకు పూర్వ వైభవాన్ని కలిగించే ఉద్దేశ్యంతో ప్రారంభించిన ఈ ప్రపంచ తెలుగు మహా సభలు ప్రతి సంవత్సరం మరింత ఘనంగా నిర్వహించాలని, తద్వారా తెలుగు భాష సంస్కృతీ సాంప్రదాయాలను పరిరక్షించడమే తమ ఆశయం అని ఆయన తెలిపారు. ఈ దిశలో మరింత కృషి చేసే ఉద్దేశ్యంతో "చైతన్య సారస్వత పరిషత్" అనే పేరుతొ ఒక సంస్థను స్థాపించామని, రాష్ట్ర మరియు విదేశాల నుండి అనేక మంది ప్రముఖ సాహితీవేత్తలు దానికి సలహాదారులుగా వ్యవహరిస్తారని, వారి సూచనల మేరకు తెలుగు భాషాభివృద్ధికి తోడ్పడతామని ఆయన తెలిపారు. ప్రతి సంవత్సరం ఇదే విధంగా భాగస్వాములై సహాయ సహకారాలు అందజేసి తెలుగు మహా సభలను విజయవంతం చేస్తూ తెలుగు భాషాభివృద్ధికి, తెలుగు సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకు తోడ్పడాలని చైతన్య రాజు కోరారు. వచ్చే సంవత్సరం జనవరి 2 వ వారం లో 4 వ వార్షిక ప్రపంచ తెలుగు మహా సభలను రాజ మహేంద్ర వరంలో నిర్వహిస్తామని, విద్యార్థులకు తెలుగు భాషా ప్రావీణ్యతా పోటీలు కూడా నిర్వహించి నగదు పురస్కారాలు ఇస్తామని ఆయన తెలిపారు. ఈ విజయోత్సవ సభలో సుమారు 400 మంది పాల్గొన్నారు.
