కోసిగి కేజీబీవీ విద్యా నిలయమా..? లేక విద్యార్థులతో వెట్టిచాకిరీ చేయించే కేంద్రమా

★ విద్యార్థినులతో వంట పనులు చేయించడం దుర్మార్గం: ఏఐఎస్ఎఫ్

పయనించే సూర్యుడు న్యూస్ 10-032026 మంత్రాలయం ఇంచార్జ్ రిపోర్టర్ కోసిగి మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయ (కేజీబీవీ) హాస్టల్లో విద్యార్థినులతో వంట పనులు చేయించడం తీవ్రంగా ఖండనీయమని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) జిల్లా ఉపాధ్యక్షుడు యస్. ఈరేష్ అన్నారు. సోమవారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పుస్తకాలు పట్టుకోవాల్సిన పసి చేతుల్లో పిండి గరిటెలు పెట్టి విద్యార్థినులను వంట మనుషులుగా మార్చడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. ఇది విద్యా చట్టాలకు, బాలల హక్కులకు విరుద్ధమని అన్నారు. విద్యార్థినులతో చపాతీలు చేయించడం పాఠశాల యాజమాన్య బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. గతంలో కూడా పదో తరగతి, ఇంటర్ విద్యార్థులతో ఇలాంటి పనులు చేయించిన ఘటనలు జరిగాయని, అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ఈ సంఘటనలు పునరావృతమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులను పనిముట్లుగా ఉపయోగిస్తే ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ తక్షణమే జోక్యం చేసుకుని సంబంధిత బాధ్యులపై, అలాగే వెట్టిచాకిరీ చేయిస్తున్న వంట ఏజెన్సీ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హాస్టల్‌లో ఉన్న ఇతర సమస్యలపై కూడా పూర్తి స్థాయి విచారణ చేపట్టి విద్యార్థినులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు నవనీత్, మల్లికార్జున, గణేష్, రాము, నరేష్, వన్నూరు వల్లి, తేజ, ఈరన్న, శేఖర్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.