నూతన సీసీ రోడ్డు, మురికికాలువ నిర్మాణానికి స్థల పరిశీలన

★ "సిసి రోడ్లు మురికి కాలువలు పరిశీలిస్తున్న సర్పంచ్ దేవి గారి అంజయ్య"

పయనించే సూర్యుడు మార్చి 10 దౌల్తాబాద్ రాజేష్) గ్రామ అభివృద్ధికి మరో ముందడుగు గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా సీసీ రోడ్డు మరియు మురికికాలువలు లేక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నూతన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో గ్రామంలోని సమస్యాత్మక వీధుల్లో సీసీ రోడ్డు మరియు మురికికాలువ నిర్మాణ పనుల కోసం ఈ రోజు స్థల పరిశీలన చేపట్టారు. గ్రామ సర్పంచ్ దేవిగారి అంజయ్య, పీఆర్‌ఏఈ రాము మరియు గ్రామ సెక్రటరీ భిక్షపతి గార్ల ఆధ్వర్యంలో దాకేల కిష్టయ్య ఇంటి వద్ద నుంచి గొల్ల యాదగిరి ఇంటి వరకు ఉన్న వీధిలో అధికారులు పరిశీలన నిర్వహించారు. ఈ సందర్భంగా మురికికాలువ మరియు సీసీ రోడ్డు నిర్మాణానికి అవసరమైన కొలతలు తీసుకొని, పనులు చేపట్టేందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేశారు. ఈ ప్రాంతంలో వర్షాకాలంలో నీరు నిల్వ ఉండటం, మురికినీరు బయటకు వెళ్లేందుకు సరైన కాలువలు లేకపోవడం వల్ల స్థానిక ప్రజలు చాలా కాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని గ్రామ పంచాయతీ ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. త్వరలోనే ఈ నిర్మాణ పనులు ప్రారంభించి, గ్రామ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం మరియు పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రేవతి, వార్డు సభ్యులు యాదగిరి, భాను, కుమార్, శ్రీను, రాజు పాల్గొన్నారు. అలాగే గ్రామస్తులు శేఖర్, విజయ్ తదితరులు హాజరై ఈ అభివృద్ధి పనులకు తమ మద్దతు తెలిపారు. గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధి కోసం చేపడుతున్న ఈ చర్యలను స్థానిక ప్రజలు స్వాగతిస్తూ, త్వరగా పనులు ప్రారంభించి పూర్తి చేయాలని కోరుతున్నారు. గ్రామాభివృద్ధికి పంచాయతీ తీసుకుంటున్న చర్యలపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.