తాత ఆశయం నెరవేర్చిన మనవడు: సిఏగా రాణించిన మయూర్ సారడ

పయనించే సూర్యుడు మార్చ్ 11(జహీరాబాద్ మండలం ప్రతినిధి స్వాతి.నర్సిములు ) కఠిన శ్రమ, పట్టుదల ఉంటే ఎంతటి లక్ష్యాన్నైనా ముద్దాడవచ్చు అని నిరూపించాడు జహీరాబాద్‌కు చెందిన యువకుడు మయూర్ సారడ. రాచన్నపేట్ వాస్తవ్యుడైన మయూర్, ఇటీవల విడుదలైన సిఏ ఫలితాల్లో 300 మార్కులకు గాను 190 మార్కులు సాధించి ఉత్తీర్ణత సాధించాడు. మయూర్ తండ్రి కీర్తిశేషులు విజయ్‌కుమార్ సారడ (టాక్స్ కన్సల్టెంట్) పదేళ్ల క్రితం అనారోగ్యంతో మరణించారు. తండ్రి లేని లోటు ఉన్నప్పటికీ, తల్లి సునీత సారడ ప్రోత్సాహంతో మయూర్ తన చదువును కొనసాగించాడు. మయూర్ తాత గోవింద్ ప్రసాద్ సారడ కూడా టాక్స్ కన్సల్టెంట్‌గా సేవలందిస్తున్నారు. తమ కుటుంబం నుండి ఎవరో ఒకరు సిఏ కోర్సు పూర్తి చేయాలని ఆయనకు బలమైన కోరిక ఉండేది. ఆ ఆశయాన్నే తన లక్ష్యంగా మార్చుకున్న మయూర్, పట్టుదలతో చదివి నేడు సిఏ క్వాలిఫై అయ్యాడు. మయూర్ సాధించిన ఈ విజయం పట్ల స్థానికంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా జహీరాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ నామ స్రవంతి రవికిరణ్.. మయూర్ నివాసానికి వెళ్లి, శాలువా మరియు పూలమాలతో ఘనంగా సన్మానించి మెమెంటోను బహుకరించారు. సాధారణ కుటుంబం నుండి వచ్చి, తండ్రి లేని లోటును అధిగమించి, తాత ఆశయం కోసం మయూర్ పడ్డ శ్రమ అభినందనీయమని, యువతకు ఇతడు ఒక స్ఫూర్తిప్రదాత అని కౌన్సిలర్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, మిత్రులు పాల్గొని మయూర్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.