దళిత కుటుంబ భూమిపై అక్రమ జోక్యం

* కులం పేరుతో బెదిరింపులు * తిప్పిరి సుమ ఆవేదన

పయనించే సూర్యుడు, కోరుట్ల, మార్చి11. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో దళిత కుటుంబానికి చెందిన భూమిపై అక్రమ జోక్యం జరుగుతోందని తిప్పిరి సుమ మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణ మందిరం ముందు నేషనల్ హైవేకు ఆనుకుని ఉన్న తమ భూమిలో నిర్మాణ పనులు చేపట్టగా కొంతమంది వ్యక్తులు అడ్డంకులు సృష్టిస్తూ బెదిరింపులకు గురిచేస్తున్నారని తెలిపారు. సుమ తెలిపిన వివరాల ప్రకారం, ఆమె తండ్రి 1980 సంవత్సరానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్ల ఆధారంగా 2011లో ఆ భూమిని చట్టబద్ధంగా కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అనంతరం వారి భూమికి ఆనుకుని ఉన్న ఇంటి యజమాని చాంద్ పాషా 2014లో ఆ స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు సృష్టించుకున్నట్లు పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో గత ఫిబ్రవరి 7న కోరుట్లకు చెందిన ప్రముఖ వ్యాపార వెత్త , బీడీ లీఫ్ కాంట్రాక్టర్ నయీమ్ కుమారుడు అక్రమ్ చాంద్ పాషా వద్ద నుంచి జీపీఏ హోల్డర్‌గా దస్తావేజులు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని తెలిపారు.తాము మున్సిపల్ అనుమతులతో భూమిలో ఇల్లు నిర్మాణ పనులు ప్రారంభించగా అక్రమ్ తన అనుచరులతో వచ్చి పనులకు ఆటంకాలు కలిగిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ నెల 7వ తేదీన ఇంటి నిర్మాణం కోసం పునాదులు వేస్తుండగా సుమారు 30 మంది వ్యక్తులు రాత్రి 10 గంటల సమయంలో వచ్చి తవ్విన గుంతలను మూసివేయడానికి ప్రయత్నించారని తెలిపారు. అలాగే 9వ తేదీ రాత్రి సమయంలో టిప్పర్ వాహనం ద్వారా గుంతల్లో మట్టి పోసి పూడ్చివేశారని ఆరోపించారు. తమ భూమిలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మాణం జరగనివ్వమంటూ అక్రమ్ మరియు అతని అనుచరులు కులం పేరుతో దూషిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు.ఈ ఘటనలతో తమ కుటుంబం తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతోందని సుమ పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ భూమిపై నిర్మాణం జరిగేలా రక్షణ కల్పించాలని, అలాగే తమను బెదిరించిన వ్యక్తులపై అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *