లద్నాపూర్ రామాలయానికి కరెంట్ పునరుద్ధరణ

★ సర్పంచ్ వనం రాంచందర్ కృషితో రామాలయానికి కరెంట్

పయనించే సూర్యుడు న్యూస్: పెద్దపల్లి, సెంటినరీ కాలనీ-11:- రామగిరి మండలం లద్నాపూర్ గ్రామంలోని శ్రీరామాలయానికి మంగళవారం విద్యుత్ సరఫరాను అధికారులు తిరిగి పునరుద్ధరించారు. ఓసీపీ–2 విస్తరణలో భాగంగా లద్నాపూర్ గ్రామంలోని కొంత ప్రాంతాన్ని పునరావాస కేంద్రానికి తరలించడంతో అక్కడ విద్యుత్ సరఫరాను పూర్తిగా నిలిపివేశారు.దీంతో రామాలయంలో కూడా కరెంట్ లేక భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.గుడి తరలింపు పూర్తయ్యే వరకు ఆలయంలో విద్యుత్ సౌకర్యం కొనసాగించాలని గ్రామస్తులు సర్పంచ్ వనం రాంచందర్ దృష్టికి తీసుకువచ్చారు.ఈ నేపథ్యంలో సర్పంచ్ వనం రాంచందర్ ఆధ్వర్యంలో గ్రామస్తులు గత వారం పునరావాస కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో పునరావాస సమస్యలతో పాటు రామాలయం సమస్యను సంబంధిత అధికారులకు వివరించారు. దీనిపై స్పందించిన జీఎం త్వరితగతిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఇచ్చిన హామీ మేరకు మంగళవారం సర్పంచ్ వనం రాంచందర్ సమక్షంలో అధికారులు రామాలయానికి విద్యుత్ సరఫరాను తిరిగి పునరుద్ధరించారు. దీంతో గ్రామస్తులు మరియు భక్తులు ఆనందం వ్యక్తం చేస్తూ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.