పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 12 మంత్రాలయం ఇంచార్జ్ రిపోర్టర్ మంత్రాలయం పరిధిలోని పెద్దకడబూరు గ్రామంలోని ఎస్సీ కాలనీలో వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని చెడిపోయిన చేతిపంపులకు బుధవారం మరమ్మతులు చేపట్టారు. గ్రామంలో ఇటీవల చేతిపంపులు పనిచేయకపోవడంతో తాగునీటి సమస్య ఎదురవుతుందని స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) ప్రభావతి దేవి వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాల మేరకు మెకానిక్ పౌలయ్య గ్రామానికి చేరుకుని చెడిపోయిన చేతిపంపులను పరిశీలించారు. అనంతరం బోర్ను పూర్తిగా బయటకు తీసి లోపలి పరికరాలను తనిఖీ చేసి పాడైన భాగాలను తొలగించి కొత్త పరికరాలను అమర్చారు. మరమ్మతులు పూర్తయ్యాక చేతిపంపు నుంచి నీరు రావడంతో అక్కడి ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. వేసవి ప్రారంభమవుతున్న సమయంలోనే చేతిపంపులు మరమ్మతు చేయడంతో తాగునీటి ఇబ్బందులు తీరాయని వారు తెలిపారు.