
పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 12 సూర్యాపేట జిల్లా ప్రతినిధి: సూర్యాపేట జిల్లా: దేశ అభివృద్ధి ప్రణాళికలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు 2027 జనాభా గణన ఎంతో కీలకమని సూర్యాపేట జిల్లా కలెక్టర్ ప్రధాన జనాభా గణన అధికారి తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశపు మందిరంలో జనాభా గణన కార్యక్రమాన్ని అధికారులు పూర్తి అవగాహనతో క్షేత్రస్థాయిలో బాధ్యతగా నిర్వహించి విజయవంతం చేయాలని ఆయన సూచించారు జిల్లాలో 2027 జనాభా గణనను సమర్థవంతంగా నిర్వహించేందుకు జిల్లా, మండల మున్సిపల్ స్థాయి అధికారులకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జనాభా గణన నిర్వహణకు ప్రభుత్వం నిర్దేశించిన విధానాలు, మార్గదర్శకాలను అధికారులు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. జనాభా గణన రెండు దశల్లో నిర్వహించబడుతుందని తెలిపారు. మొదటి దశల్లో హౌస్ లిస్టింగ్, ఇళ్ల జాబితా,మరియు గృహాల గణన మే 11 నుంచి జూన్ 9 వరకు జరుగుతుందని పేర్కొన్నారు. రెండో దశల్లో జనాభా గణన 2027 ఫిబ్రవరిలో నిర్వహిస్తారని మార్చి 1 2027 తేదీని రిఫరెన్స్ డేట్ గా పరిగణిస్తారని వివరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, మరియు మౌలిక సదుపాయాల ప్రణాళికలు రూపొందించేందుకు జనాభా గణన ద్వారా లభించే గణాంకాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఈసారి జనాభా గణనను దేశంలో తొలిసారిగా పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించనున్నట్లు చెప్పారు. మొబైల్ యాప్ లు పోర్టల్స్ ద్వారా గణన ప్రక్రియ నిర్వహించబడుతోందని, ప్రజలు తమ వివరాలను స్వయంగా ఆన్లైన్లో నమోదు చేసుకునేందుకు ప్రత్యేక పోర్టల్ ను గణన ప్రారంభానికి సుమారు 15 రోజుల ముందు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. మొదటి దశల్లో జరిగే హౌస్ లిస్టింగ్ సమయంలో ఇంటి నిర్మాణానికి ఉపయోగించిన పదార్థాలు, ఇంటి పరిస్థితి, కుటుంబ యజమాని వివరాలు, తాగునీటి సౌకర్యం, మురుగునీటి పారుదల వ్యవస్థ, మరుగుదొడ్ల లభ్యత, వంటగది సౌకర్యం వంటి వివరాలతో పాటు రేడియో, టెలివిజన్, స్మార్ట్ ఫోన్, కంప్యూటర్, సైకిల్, కారు వంటి గృహ సౌకర్యాలపై మొత్తం 34 ప్రశ్నలకు సంబంధించిన వివరాలను ఎన్యూమరేటర్లు ప్రతి ఇంటికి వెళ్లి సేకరిస్తారని వివరించారు.అనంతరం శిక్షణ నిర్వాహకులు సిపిఓ కిషన్ నాయక్ మాట్లాడుతూ, అన్ని శాఖల సమన్వయంతో ఈ ప్రక్రియను విజయవంతం చేయాలని సూచించారు జనాభా గణాంక అధికారులు యువేందర్ బాబు, రవీంద్ర నాయక్ ప్రతి మండలంలోని రెవెన్యూ గ్రామాలు, పట్టణాల్లోని వార్డులను గణన బ్లాకులుగా ఎలా విభజించాలి, గణన ప్రక్రియను ఎలా నిర్వహించాలి అనే అంశాలపై అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, సూర్యాపేట కోదాడ హుజూర్ నగర్ ఆర్డీవోలు మాస్టర్ ట్రైనర్ రమేష్, తాహసిల్దార్లు తదితరులు పాల్గొన్నారు.