

పయనించే సూర్యుడు మార్చి 13 కరీంనగర్ న్యూస్: నగరం పట్టణాల అభివృద్ధిలో కార్పొరేటర్లు, కౌన్సిలర్ల పాత్ర కీలకమని, అందరం కలిసికట్టుగా జిల్లాను అభివృద్ధిలో ముందు వరుసలో నిలుపుదామని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక" 99రోజుల కార్యాచరణలో భాగంగా నూతనంగా ఎన్నికైన మున్సిపల్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో పలు అంశాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. శిక్షణ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, వివిధ ప్రభుత్వ శాఖలు ప్రజల కోసం అందించే సేవా కార్యక్రమాలు, పథకాల గురించి పి.పి.టి ద్వారా వివరించారు. మున్సిపల్ చట్టాలు, మున్సిపాలిటీలోని వివిధ విభాగాలు నిర్వహించే కార్యక్రమాలు, అధికారులు, సిబ్బంది విధులు, బాధ్యతలు గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా మాట్లాడుతూ కార్పొరేటర్లు, వార్డు సభ్యులు ఎంత బాధ్యతగా ఉంటే ఆ పట్టణాలు అంతలా అభివృద్ధి చెందుతాయని అన్నారు. వివిధ విభాగాల ప్రభుత్వ సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ వార్డు స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలకు, సమస్యల పరిష్కారానికి ప్రణాళిక తయారు చేసుకోవాలని సూచించారు. నిత్యం శానిటేషన్ విధానం పర్యవేక్షించాలని, మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, వార్డులను శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని అన్నారు. ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు సంబంధిత అధికారుల ఎదురుగానే పరిష్కారం కావాలని ఉద్దేశంతో మున్సిపాలిటీల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించామని పేర్కొన్నారు. 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పెండింగ్ లో ఉన్న ఫైళ్ల క్లియరెన్స్, దరఖాస్తుల పరిష్కారం చురుగ్గా సాగుతోందని తెలిపారు. ప్రజాపాలన కార్యక్రమంలో కార్పొరేటర్లు, కౌన్సిలర్లు పాలుపంచుకుంటూ అంతిమంగా ప్రజా సేవే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు పౌరుల సేవలకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. అవినీతి రహిత పాలనతో ఆదర్శంగా నిలవాలని సూచించారు. మున్సిపల్ చట్టాలపై అవగాహన పెంచుకొని ప్రజలకు సేవలు అందించాలని అన్నారు. ప్రతి కార్పొరేటర్ డివిజన్లో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ మున్సిపల్ చేపట్టే పనులను పర్యవేక్షించాలని కోరారు. వేసవి దృష్ట్యా తాగునీరు వృధా చేయకుండా అవగాహన కల్పించాలని, ఎక్కడైనా పైపు లైన్ మరమ్మతులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని అన్నారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ "ప్రజా పాలన ప్రగతి ప్రాణాళిక" 99 రోజుల కార్యాచరణలో భాగంగా ప్రతి కార్పొరేటర్ డివిజన్లో పర్యటించి సమస్యలను గుర్తించాలని తెలిపారు. ప్రజల నుండి సమస్యలు తెలుసుకుని అధికారులతో చర్చించి పరిష్కారం అయ్యే విధంగా చూడాలని తెలిపారు. ప్రజాపాలనలో మున్సిపాలిటీలో పెండింగ్ లో ఉన్న దరఖాస్తులు పరిష్కారం పరిష్కరించడం మంచి విషయమని తెలిపారు. నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు శిక్షణను సద్వినియోగం చేసుకొని ప్రజలకు మరింత సేవ అందించాలని తెలిపారు. డిప్యూటీ మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ కరీంనగర్ మున్సిపల్ ఎలక్షన్ లో 66 స్థానాలకు గాను 46 మంది కొత్తగా ఎన్నికైన వారు ఉన్నారని తెలిపారు. ఇలాంటి శిక్షణ వారికి ఉపయోగకరమని అన్నారు. కొత్తగా ఎన్నికైన కార్పొరేటర్లు డివిజన్లో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకోవాలని అన్నారు. నగరంలో మొక్కల పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. మున్సిపల్ సమస్యలకు సంబంధించి ప్రజలు ఇచ్చిన అర్జీలు ఏ దశలో ఉన్నాయో తెలుసుకునేందుకు మున్సిపల్ డాష్ బోర్డులో సమాచారం సూచించాలని అన్నారు. దీనివల్ల జవాబుదారీతనం పెరుగుతుందని తెలిపారు కరీంనగర్ నగర పాలక సంస్థ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లకు మున్సిపల్ చట్టాలు, వ్యవస్థ, విభాగాలు వాటి పనితీరుపై అవగాహన చాలా ముఖ్యమని అన్నారు. దీనివల్ల ప్రజలకు మరింత చేరువై సేవ చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన శిక్షణలో ప్రభుత్వ సేవలు, మున్సిపల్ చట్టాలు, కార్పొరేటర్ల విధులు, బాధ్యతలు గురించి స్పష్టంగా శిక్షణ ఇస్తున్నామని, నూతన కార్పొరేటర్లు కౌన్సిలర్లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో రమేష్, హుజురాబాద్ మునిసిపల్ చైర్పర్సన్ రొంటాల సుహాసిని, వైస్ చైర్పర్సన్ గూడూరి అంజలి, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ ప్రశాంత్ కుమార్, వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ మహమ్మద్, చొప్పదండి మున్సిపల్ చైర్పర్సన్ వడ్లూరి సరిత, వైస్ చైర్పర్సన్ పెరుమాండ్ల మానస, మున్సిపల్ కమిషనర్లు సయ్యద్ ముసాబ్ అహ్మద్, మనోహర్, మహమ్మద్ ఆయాజ్ పాల్గొన్నారు.