ఎండిన వరి పంటలను పరిశీలించిన ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం .

★ 7ఆర్ కాల్వ పనులు వెంటనే ప్రారంభించాలి ★ సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం .

పయనించే సూర్యుడు న్యూస్ మునుగోడు మార్చి 13. మునుగోడు మండలంలోని కలవలపల్లిలో ఎండిపోయిన వరి పంటలను ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం గురువారం పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంట నష్టాల వివరాలను తెలుసుకున్నారు. రైతులకు న్యాయం చేయాలని, ప్రభుత్వానికి సమస్యలను తెలియజేస్తామని ఆయన హామి ఇచ్చారు. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కలవలపల్లి గ్రామంలో ఎండిపోయిన వరి పంటలను సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సాగునీటి కొరతతో బోరుబావులపై ఆధారపడి సాగు చేసిన వరి పంటలు ఎండిపోవడంతో రైతు నాయకుల విజ్ఞప్తి మేరకు ఆయన పంట పొలాలను సందర్శించారు.ట్యాంకర్ నీటితో పంటలను కాపాడుకునే పరిస్థితి రావడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కలవలపల్లి గ్రామ సాగునీటికి సంబంధించిన 7ఆర్ మైనర్ కాల్వ పనులు తక్షణమే చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కాల్వ నిర్మాణంలో నిర్లక్ష్యం వహించిన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. మునుగోడు ప్రాంతంలోని 17 గ్రామాల్లో వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని పేర్కొంటూ, బాధిత రైతులకు ఎకరాకు రూ.40 వేల చొప్పున ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.