
పయనించే సూర్యుడు మార్చి 13, మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ నరిగె కళాశేఖర్: తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు, జడ్చర్ల మున్సిపల్ కార్యాలయం ముందు గురువారం కార్మికులు భారీ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఆకుల వెంకటేష్ మాట్లాడుతూ , గత 30 ఏళ్లుగా చాలీచాలని వేతనాలతో పని చేస్తున్న మున్సిపల్ అవుట్‌సోర్సింగ్ కార్మికులను ఈ కాంగ్రెస్ ప్రభుత్వమైనా వెంటనే పర్మినెంట్ చేయాలి. రెండో పీఆర్సీ ప్రకారం కార్మికులకు కనీస వేతనం ₹26,000 ఇవ్వాలన్నారు.దానితో పాటు ప్రతి కార్మికుడికి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడంతో పాటు, మరణించిన కార్మికుల దహన సంస్కారాల కోసం తక్షణమే ₹30,000 ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పట్టణ కమిటీ నాయకులు ఇందిరమ్మ, శివలీల, యాదయ్య, కృష్ణ , అంజమ్మలు మాట్లాడుతూ.. 2012 నుండి 2014 వరకు కార్మికుల వేతనాల నుండి కట్ చేసిన దాదాపు ₹40 లక్షల ఈపీఎఫ్ నిధులు అధికారుల నిర్లక్ష్యం వల్ల కార్మికుల వ్యక్తిగత ఖాతాల్లో జమ కాలేదని మండిపడ్డారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈపీఎఫ్ సంస్థ జడ్చర్ల మున్సిపాలిటీకి ₹99 లక్షల జరిమానా విధించినా అధికారుల్లో చలనం లేదని విమర్శించారు. 2012 నుండి ఇప్పటివరకు 52 మంది కార్మికులు చనిపోయినా వారి కుటుంబాలకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఈ నెల 16న జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు, అలాగే 24 న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద ‘చలో హైదరాబాద్’ ధర్నా ఉంటుందని కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చూచించారు. ఈనెల 31లోగా ఈపీఎఫ్ నిధులు జమ చేయకుంటే రాష్ట్రవ్యాప్త సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు.అనంతరం అధికారులు అందుబాటులో లేకపోవడంతో ఇన్ వర్డ్స్ సెక్షన్ ఆఫీసర్ శివకుమార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి ఎం. విద్యాసాగర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎం. మహేష్, పట్టణ కమిటీ నాయకులు ఇందిరమ్మ, శివలీల, యాదయ్య, కృష్ణ, అంజమ్మ, ఆంజనేయులు, చంద్రమౌళి, శివమ్మ, సాయి, అలివేలు, చంద్రకళ, గిద్ద శంకర్ తదితరులు పాల్గొన్నారు.