పయనించే సూర్యడు ప్రతినిధి సాగర్ మర్చి.13.2016 అల్లూరి సీతారామరాజు జిల్లా,అరకువేలి నియోజకవర్గం డుంబ్రిగూడ మండల కేంద్రంలో ఉన్న మంచినీటి బోర్‌వెల్ మూడు సంవత్సరాలుగా పాడైపోయి మరమ్మత్తులు చేయకపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు. ఎదుర్కొంటున్నారని ఏపీ కాంగ్రెస్ పార్టీ పిసిసిడెలిగేట్ మెంబర్ పాచిపెంట చిన్నస్వామి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.ఈ రోజు ఆయన మండల కేంద్రంలోని అంగన్వాడీ సెంటర్ పక్కన ఉన్న బోర్‌వెల్‌ను స్వయంగా పరిశీలించి, మూడు సంవత్సరాలుగా అది పనిచేయకపోవడం వల్ల అంగన్వాడీ చిన్నారులు, మహిళలు, వృద్ధులు మరియు స్థానిక గ్రామస్తులు తాగునీటి కోసం తీవ్రంగా అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. మంచినీరు ప్రతి మనిషికి అత్యంత అవసరమైన ప్రాథమిక హక్కు అని పేర్కొంటూ, ఇంత కీలకమైన సమస్యపై ఇప్పటివరకు ప్రజా ప్రతినిధులు మరియు అధికారులు స్పందించకపోవడం చాలా దురదృష్టకరమని విమర్శించారు. ప్రత్యేకంగా మండల కేంద్రంలోనే ఈ పరిస్థితి ఉంటే మారుమూల గిరిజన గ్రామాల్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తాగునీటి కోసం గిరిజనులు ఇబ్బందులు పడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. అందువల్ల జిల్లా అధికారులు మరియు మండల అధికారులు వెంటనే స్పందించి చెడిపోయిన బోర్‌వెల్‌ను తక్షణమే మరమ్మత్తు చేసి అంగన్వాడీ చిన్నారులు మరియు స్థానిక గ్రామస్తులకు సురక్షితమైన తాగునీటి సౌకర్యం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా వేసవి కాలం సమీపిస్తున్న నేపథ్యంలో గిరిజన ప్రాంతాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుని అన్ని గ్రామాల్లో బోర్‌వెల్లు,పైపులైన్లు,ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన కోరారు.ప్రజల ప్రాథమిక అవసరమైన తాగునీటి సమస్యను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే పరిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకుడు తుడుము అభిషేక్ పాల్గొన్నారు.