డ్రైనేజీ సమస్యపై సీపీఐ ధర్నా

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 13 మంత్రాలయం ఇంచార్జ్ రిపోర్టర్ పెద్దకడబూరులో మండల పరిషత్ కార్యాలయం ముందు నెలకొన్న డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సీపీఐ ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయం ఎదుటే మురుగు నీరు నిల్వ ఉండటంతో దుర్వాసన వ్యాపించి ప్రజలు, కార్యాలయానికి వచ్చే వారికి తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ నేత వీరేష్, రైతు సంఘం నాయకుడు మబ్బు అంజినేయ మాట్లాడుతూ సంబంధిత అధికారుల కార్యాలయం ముందే పారిశుద్ధ్యం పూర్తిగా లోపించి డ్రైనేజీ నీరు నిల్వ ఉండటం బాధాకరమన్నారు. సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎంపీడీవో ప్రభావతి దేవికి అందజేశారు. సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ కార్యకర్తలు, రైతు సంఘం నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.