త్రాగునీరు వృధాగా పోతున్న పట్టించుకోని అధికారులు

పయనించే సూర్యుడు న్యూస్, మార్చి13 (ఏలేశ్వరం మండల రిపోర్టర్ ఏ శివాజీ):పంచాయతీ నుండి నగర పంచాయతీగా రూపాంతరం చెందిన ఏలేశ్వరం నగర పంచాయతీ అభివృద్ధి పేరుతో పన్నుల రూపంలో ప్రజల నుండి ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్న అధికారులకు త్రాగునీరు వృధాగా పోతున్న కలుషితం అవుతున్న వారి కంటికి కనబడలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగర పంచాయతీగా రూపాంతరం చెందిన ఏలేశ్వరం పట్టణం లో త్రాగునీటి పైపులు 16 చోట్ల ముఖ్యంగా సువ్వయం పేట (కుమ్మర వీధి) లో డ్రైనేజీల నుండి వెళ్లడంతో ఆ పైపులు కు లీకులు ఉండడం వల్ల డ్రైనేజీ నుండి వచ్చే మురుగునీరు త్రాగునీటితో కలిసిపోవడంతో అదే నీరు స్థానిక ప్రజలు త్రాగడం ద్వారా అనేక రోగాల బారిన పడుతున్నట్లు అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు.కుళాయిల నుండి వచ్చే త్రాగునీరు నియంత్రణ లేకపోవడంతో ఆ నీరు వృధాగా పోవడం గమనార్హం. అయినా అధికారులకు కనపడని గుసగుసలు వినిపిస్తున్నాయి. పట్టణ పరిధిలో సుమారు 386 పబ్లిక్ కుళాయిలు ఉండగా అందులో 50 శాతానికి పైగానే ట్యాపులు లేకపోవడంతో త్రాగునీరు వృధాగా పోతూనే ఉంది.ఇక మురుగు కాలవ లో వెళ్లే పైపులు ద్వారా మురుగునీరు త్రాగునీరు కలిసిపోవడంతో అదే నీరును ప్రజలు తీసుకోవడంతో అలాగే ఇబ్బందులకు గురైన సంఘటనలు కోకొల్లలు. నగర పంచాయతీకి పన్నుల రూపంలో ఆదాయం వస్తున్న అభివృద్ధి మాత్రం ఆమడ దూరంలోనే ఉందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇకనైనా రానున్న వేసవికాలం దృష్టిలో ఉంచుకుని త్రాగునీరు పైపులకు మరమ్మత్తులు చేపట్టడంతో పాటు కుళాయిలకు ట్యాప్ లు అమర్చినట్లయితే త్రాగునీరు వృధాగా పోకుండా ఉంటుందన్నారు.