పెరిగిన ఉష్ణోగ్రతలతో ప్రమాదంలో చిన్నారులు

* "తల్లిదండ్రుల్లో ఆందోళన – హెచ్చరికలు జారీ చేసిన పోలీసులు"

పయనించే సూర్యుడు మార్చి 13 రాజేష్) మార్చి 12, దౌల్తాబాద్: రాయపోల్ మండలం బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని మక్తా మాసాన్‌పల్లి గ్రామం వద్ద ప్రవహిస్తున్న గోదావరి జలాలకు సంబంధించిన కాలువలో గురువారం మధ్యాహ్నం ప్రమాదకర ఘటన తృటిలో తప్పింది. దాదాపు 8 నుండి 10 సంవత్సరాల మధ్య వయస్సు గల ఎనిమిది మంది చిన్నారులు ఎటువంటి అవగాహన లేకుండా ఒకరి సహాయంతో మరొకరు కాలువలోకి దూకి ఈత కొట్టేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో కాలువలో నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో వారు కొట్టుకుపోయే ప్రమాదం ఏర్పడింది. అక్కడుగా వెళ్తున్న “పయనించే సూర్యుడు” రిపోర్టర్ ఈ విషయాన్ని గమనించి వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న బేగంపేట పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని పిల్లలను కాలువ దగ్గర నుంచి చెదరగొట్టి ప్రమాదాన్ని నివారించారు. ఈ సందర్భంగా బేగంపేట పోలీస్ కానిస్టేబుళ్లు అనిల్ మరియు యుగంధర్ మాట్లాడుతూ, ప్రజల రక్షణ తమ బాధ్యత అని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా వేసవిలో పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగా పిల్లలు కాలువలు, చెరువుల వద్దకు వెళ్లకుండా చూసుకోవాలని సూచించారు. ఏదైనా ప్రమాదకర పరిస్థితి గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. అలాగే ఇటువంటి సంఘటనలు చూసినప్పుడు “మనకెందుకులే” అనే భావన లేకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్పందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *