
పయనించే సూర్యుడు / మార్చి 15 / దిడ్డి రాము / జమ్మికుంట రూరల్ ; ఇల్లంతకుంటలో ప్రసిద్ధి చెందిన శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం చైర్మన్ ఇంగిలే రామారావు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశం ఉన్నందున ఆలయ ప్రాంగణంలో పరిశుభ్రత పనులు చేపట్టడంతో పాటు ఆలయ భవనాలకు కొత్తగా రంగులు వేస్తున్నామని చెప్పారు. ఈనెల 25వ తేదీ నుంచి ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 6వ తేదీన ఏకాంత సేవతో ముగుస్తాయని ఆయన వివరించారు. ఈ సందర్భంగా ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, ఉత్సవాలు, వాహన సేవలు నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, పార్కింగ్, భద్రత వంటి ఏర్పాట్లు కూడా చేపడుతున్నామని పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా సమీప ప్రాంతాల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున హాజరవుతారని ఆశిస్తున్నామని చెప్పారు. భక్తులందరూ కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో విజయవంతం చేయాలని దేవస్థానం తరఫున కోరారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో సుధాకర్, ధర్మకర్తలు పరమేష్, కిరణ్, రామ్ రెడ్డి, నారాయణరెడ్డి, ఆలయ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.