పయనించే సూర్యుడు మార్చి 15, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) విలువల రాజకీయాలకు నిలువుటద్దం పవన్ కల్యాణ్ అని, ఆయన మార్గదర్శకత్వంలో కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే పంతం నానాజీ ఉద్ఘాటించారు. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కాకినాడ రూరల్‌లో అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపిన అనంతరం నానాజీ మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ వైఫల్యాలపై నానాజీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “ఒక్క ఛాన్స్” అంటూ అధికారంలోకి వచ్చిన వారు రాష్ట్రాన్ని 10 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టేశారని విమర్శించారు. సాగునీటి రంగం నుంచి పౌర సరఫరాల వరకు అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవస్థలను గాడిలో పెట్టడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. తన నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రతిపక్షాలకు బహిరంగ సవాల్ విసిరారు. స్వల్ప కాలంలోనే సుమారు రూ. 200 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన. దాదాపు రూ. 400 కోట్లతో ప్రజలకు నేరుగా లబ్ధి చేకూర్చడం.నేను చెప్పిన ఈ పనులు జరగలేదని ఎవరైనా నిరూపిస్తే, వచ్చే ఎన్నికల్లో ఓటు అడిగే అర్హతే నాకు ఉండదు. ప్రజల కోసం నిరంతరం శ్రమించడమే మా డీఎన్‌ఏలో ఉంది,” అని నానాజీ స్పష్టం చేశారు. కూటమి పాలన – భవిష్యత్ లక్ష్యం రాష్ట్రం మళ్లీ పూర్వవైభవం సంతరించుకోవాలంటే టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి మరో 10 నుండి 15 ఏళ్ల పాటు అధికారంలో ఉండాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన జెండా రెపరెపలాడాలని, ప్రతి గ్రామంలోనూ పార్టీ సభ్యత్వాన్ని భారీగా పెంచాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సర్పంచులుగా, ఎంపీటీసీలుగా జనసైనికులు విజయం సాధించి, గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులు వేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో జనసేన నాయకులు, వీర మహిళలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.