పయనించే సూర్యుడు – మార్చి 15, రాజేష్) దౌల్తాబాద్ మండలంలోని దీపాయంపల్లి గ్రామంలో పచ్చని వాతావరణాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ప్రత్యేక నర్సరీ ఏర్పాటు చేయబడింది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ గజ్వేల్ .దుర్గేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామ పరిసరాలను మరింత పచ్చగా, స్వచ్ఛంగా మార్చడం మరియు పర్యావరణ పరిరక్షణకు గ్రామ ప్రజలను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యంగా నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ గజ్వేల్ దుర్గేష్ మాట్లాడుతూ గ్రామంలో పచ్చదనం పెంపొందించేందుకు నర్సరీ ఏర్పాటు చేయడం ఎంతో అవసరమని అన్నారు. గ్రామ పరిసరాల్లో ఎక్కువ సంఖ్యలో చెట్లు, మొక్కలు పెరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు ప్రతి మొక్కకు చల్లదనం ఉండే విధంగా గ్రీన్ మ్యాట్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. దీని ద్వారా మొక్కలు వేడి ప్రభావం నుంచి రక్షణ పొందడంతో పాటు వేగంగా పెరిగే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. గ్రామంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున మొక్కల పంపిణీ చేయాలని కూడా పంచాయతీ యోచన చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. గ్రామ ప్రజలు కూడా చెట్ల సంరక్షణలో భాగస్వామ్యం కావాలని, ప్రతి కుటుంబం కనీసం ఒక మొక్కను నాటాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, పచ్చని గ్రామం నిర్మాణం అందరి సహకారంతోనే సాధ్యమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మసూరి శ్రీశైలం, వార్డ్ మెంబర్ . స్వామి, పంచాయతీ కార్యదర్శి, పారిశుద్ధ్య కార్మికులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధి కోసం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు అభినందించారు.