శివాజీ విగ్రహానికి వ్యతిరేకం కాదు… స్థలంపై మాత్రమే అభ్యంతరం: సీపీఐ నాయకుడు ఈర్ల చంద్రమౌళి

పయనించే సూర్యుడు మార్చి 15 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ బిజినపల్లి మండలం వెలుగొండ గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటు విషయంలో సీపీఐకి ఎలాంటి అభ్యంతరం లేదని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఈర్ల చంద్రమౌళి స్పష్టం చేశారు. గ్రామంలో కొందరు వ్యక్తులు ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని గ్రామ చౌరస్తాలో ఏర్పాటు చేయడానికి దిమ్మె నిర్మాణానికి పూనుకున్నారని తెలిపారు. అయితే అదే స్థలంలో గతంలో బస్టాండ్ నిర్మాణం చేయాలని నిర్ణయించుకుని గ్రామపంచాయతీ తీర్మానం కూడా చేసిన విషయం వాస్తవమని పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకోకుండా కొందరు అక్కడ పెద్ద పిలర్లు నిర్మించేందుకు గుంతలు తవ్వడం పట్ల తమకు అభ్యంతరం ఉందన్నారు. అందుకే మరో అనుకూలమైన స్థలాన్ని ఎంపిక చేసి గ్రామంలోని అందరూ కలిసి ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి తాము పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. అయితే తాము విగ్రహ ఏర్పాటుకు వ్యతిరేకమని కొందరు చేస్తున్న దుష్ప్రచారం పూర్తిగా అసత్యమని, అలాంటి దుష్ప్రచారాలను ఖండిస్తున్నామని ఈర్ల చంద్రమౌళి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.