పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 16 రిపోర్టర్ అభి కౌతాళం మండలంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక ప్రధానోపాధ్యాయుడిని విద్యాశాఖ అధికారులు కాపాడుతున్నారని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్. ఈరేష్ తీవ్రంగా విమర్శించారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గత 25 రోజులుగా సదరు ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని ఉద్యమాలు చేపట్టినా, సాక్ష్యాధారాలతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమని అన్నారు. విద్యాశాఖ అధికారులు విద్యార్థుల పక్షాన ఉన్నారా, లేక అవినీతిపరుల పక్షాన ఉన్నారా అని ప్రశ్నించారు. అక్షరాస్యతలో వెనుకబడిన కౌతాళం మండలంలో ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాల్సిన సమయంలో అవినీతి అధికారుల వల్ల విద్యా వ్యవస్థ దెబ్బతింటోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పేద విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న సదరు ప్రధానోపాధ్యాయుడిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా అధికారులు స్పందించకపోతే ఈ విషయాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తామని, అవినీతికి సహకరిస్తున్న అధికారుల వివరాలను కూడా బహిర్గతం చేస్తామని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి తక్షణమే స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. లేదంటే వేలాది విద్యార్థులతో జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల అధ్యక్షుడు హనుమేష్, కార్యదర్శి సాయి వర్మ, స్వామి, గోవిందు, భీమయ్య, ఐనూర్ తదితర నాయకులు పాల్గొన్నారు.