గంభీరపూర్ గ్రామంలో శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణ భూమి పూజ కార్యక్రమం

పయనించే సూర్యుడు, కోరుట్ల మార్చి 16 గంభీరపూర్ గ్రామంలో భక్తుల ఆధ్యాత్మిక ఆకాంక్షల మేరకు శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఫాల్గుణ మాసం బహుళ ఏకాదశి సందర్భంగా ఆదివారం ఉదయం 10:36 గంటలకు దివ్య ముహూర్తంలో ఆలయ నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమం సంప్రదాయబద్ధంగా జరిగింది. వేద మంత్రోచ్చారణల మధ్య పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ నిర్మాణం విజయవంతంగా పూర్తవాలని శ్రీ అయ్యప్ప స్వామిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుంటుక మనోహర్ గారు, ఆలయ కమిటీ సభ్యులు మురళీధర్, మైకల రవి, చిలువేరి రాజు, పెండ్యాల ప్రభాకర్ గార్లు పాల్గొన్నారు. అదేవిధంగా గ్రామ పెద్దలు, భక్తులు మరియు ఇతర సభ్యులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో విజయవంతం చేశారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ, భక్తుల సహకారంతో ఆలయ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. గంభీరపూర్ గ్రామంలో నిర్మించబడుతున్న ఈ ఆలయం భక్తులకు ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతుందని గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *