మానవత్వం చాటుకున్న క్రీడాకారులు ,రోడ్డు ప్రమాదంలో మరణించిన మిత్రుడి కుటుంబానికి ఆర్థిక సాయం

★ నరేష్ మరణం తీరని లోటు_ తోటి క్రీడాకారులు ★ క్రీడాకారుల చొరవను అభినందించిన _గ్రామ ప్రముఖులు

పయనించే సూర్యుడు మార్చి 16, మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ నరిగె కళాశేఖర్: రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మిత్రుడి కుటుంబాన్ని ఆదుకునేందుకు తోటి క్రీడాకారులు తమ ఉదారతను చాటుకున్నారు. రాజాపూర్ మండల పరిధిలోని చెన్నవెళ్లి గ్రామానికి చెందిన చిల్వర్ నరేష్ ఇటీవల జాతీయ రహదారిపై జరిగిన లారీ ప్రమాదంలో దురదృష్టవశాత్తు మరణించిన సంగతి తెలిసిందే. నరేష్ అకాల మరణం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపగా, తోటి క్రికెట్ క్రీడాకారులు నరేష్ జ్ఞాపకార్థం తామంతా కలిసి సేకరించిన రూ. 9,300 నగదును ఆదివారం నాడు మృతుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నరేష్ ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటూ అందరితో కలివిడిగా ఉండేవాడని, అతని మరణం తమకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. తమ వంతు బాధ్యతగా ఈ చిన్నపాటి సాయాన్ని అందజేస్తున్నట్లు తెలిపారు. క్రీడాకారుల చొరవను మాజీ డిప్యూటీ సర్పంచ్ చర్లపల్లి మల్లేష్, ముదిరాజ్ సంఘం ఉపాధ్యక్షుడు పిట్టల ఆంజనేయులు , గ్రామ ప్రముఖులు అభినందించారు. ఈ కార్యక్రమంలో చర్లపల్లి రాఘవేందర్, పోలేమోని మహిబు, పిట్టల రాజ్ కుమార్, శ్రీనివాసులు, శేఖర్, బాలు, శివ, సంజీవ, పార్వతయ్య, ప్రశాంత్, రమేష్, అరుణ్, శ్రీహరి, ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు.