పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 17 రిపోర్టర్ అభి కర్నూలు జిల్లా కోసిగి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినీలతో వంట పనులు, పారిశుద్ధ్య పనులు చేయిస్తున్న ప్రిన్సిపాల్‌పై తక్షణ చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు రంగప్ప, శ్రీను డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జాయింట్ కలెక్టర్ నూర్ కమల్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థినీలు చదువుకునే వయస్సులో ఉండగా వారితో హాస్టల్‌లో వంట పనులు చేయించడం, శుభ్రత పనులు చేయించడం చాలా అన్యాయమని అన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే విద్యాసంస్థల్లో విద్యార్థుల సంక్షేమం, విద్యకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు. అయితే కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మాత్రం విద్యార్థినీలను గృహ పనులకు ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా విద్యార్థులకు తాగునీరు అందించే విషయంలో కూడా తీవ్ర నిర్లక్ష్యం జరుగుతోందని పేర్కొన్నారు. డస్ట్‌బిన్ బకెట్లలో తాగునీరు నింపి విద్యార్థులకు తాగిస్తున్నారని, ఇది విద్యార్థుల ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థినీలు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని వారు కోరారు. విద్యార్థినీలను పనులకు ఉపయోగిస్తున్న బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, సంబంధిత ప్రిన్సిపాల్‌ను తక్షణమే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యాలయంలో విద్యార్థులకు తగిన సదుపాయాలు కల్పించి, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు విజ్ఞప్తి చేశారు.