
పయనించే సూర్యుడు మార్చి 18 రాజేష్ దౌల్తాబాద్) దౌల్తాబాద్: తెలంగాణ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల ఫోరం దౌల్తాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మండల విద్యాధికారి గజ్జల కనకరాజు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దౌల్తాబాద్ మండల సాంఘిక శాస్త్ర ఫోరం ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారని ప్రశంసించారు. మండలంలోని ఉన్నత పాఠశాలల విద్యార్థులకు ప్రతిభా పరీక్షలు నిర్వహించడం అభినందనీయం అని తెలిపారు. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన డైరీని పరిశీలించిన ఆయన, ఉపాధ్యాయుల అవసరాలకు అనుగుణంగా దీన్ని రూపొందించారని కొనియాడారు. డైరీలో అకాడమిక్ స్టాండర్డ్స్, పాఠ్య ప్రణాళికలు, వార్షిక ప్రణాళికలు పొందుపరచడం మంచి ప్రయత్నమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక శాస్త్ర ఫోరం కార్యదర్శి ఎన్ .కిషన్ రెడ్డి, మండల సాంఘిక శాస్త్ర ఫోరం అధ్యక్షుడు జంపన్న, ఉపాధ్యాయులు సత్యనారాయణ, బాల్ రెడ్డి, రాజు, దశరథం, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.