పయనించే సూర్యుడు మార్చి 18 (హైదరాబాద్ మాధవరెడ్డి ) తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణి ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ కౌన్సిల్ ఫర్ సిటిజన్స్ వాయిస్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.ప్రజావాణి అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 80 వేలకుపైగా ఫిర్యాదులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని సీసీవీ ప్రతినిధులు తెలిపారు. తమ సమస్యలు పరిష్కారం అవుతాయనే ఆశతో సామాన్య ప్రజలు సమయం మరియు డబ్బు ఖర్చు చేసి కలెక్టరేట్‌కు వస్తున్నప్పటికీ, కొన్ని శాఖల అధికారుల నిర్లక్ష్యం మరియు జాప్యం కారణంగా అనేక ఫిర్యాదులు నెలల తరబడి పెండింగ్‌లోనే కొనసాగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి ప్రజలకు సకాలంలో న్యాయం అందేలా తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.ఈ సందర్భంగా సీసీవీ ప్రతినిధులు కలెక్టర్‌కు కొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి ఫిర్యాదును నిర్దిష్ట గడువులోపు పరిష్కరించేలా అన్ని శాఖల అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. అలాగే నెలల తరబడి పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని సూచించారు.అదేవిధంగా ఫిర్యాదు స్థితి గురించి ఎస్ఎంఎస్ లేదా ఆన్‌లైన్ ద్వారా సమాచారం అందించే పారదర్శక వ్యవస్థను బలోపేతం చేయాలని, ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారాన్ని పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయాలని కోరారు.సామాన్య ప్రజల హక్కుల పరిరక్షణ మరియు మెరుగైన పరిపాలన కోసం జిల్లా యంత్రాంగం వెంటనే చర్యలు తీసుకోవాలని సీసీవీ విజ్ఞప్తి చేసింది.ఈ కార్యక్రమంలో నరేష్ బాబు రామ్మోహన్ వెంకటేష్ సురేష్ మణికంఠ మల్లేశ్వరరావు మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.