భగత్ సింగ్ వర్ధంతి వారోత్సవాలు ప్రారంభం – పోస్టర్ ఆవిష్కరణ

పయనించే సూర్యుడు మార్చి 18,(చింతకాని మండలం రిపోర్టర్. ఏర్పుల కోటేశ్వరరావు) విప్లవ వీరుడు భగత్ సింగ్ 95వ వర్ధంతి సందర్భంగా నిర్వహిస్తున్న స్మారక యువజన వారోత్సవాలను విజయవంతం చేయాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చింతకాని ఎస్సై వీరేందర్ వారోత్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బొడ్డు మధు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్య సమరంలో యువతకు మార్గదర్శకుడిగా నిలిచిన భగత్ సింగ్ ఆశయాలను నేటి యువత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. సామాజిక న్యాయం, లౌకికత్వం, సమానత్వం కోసం ఆయన చేసిన త్యాగం భారత యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని తెలిపారు.దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, విద్యారంగంపై దాడులు, ప్రజాస్వామ్య హక్కులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో భగత్ సింగ్ ఆలోచనలు మరింత ప్రాసంగికమయ్యాయని పేర్కొన్నారు. సమాజ మార్పు కోసం యువత చైతన్యవంతంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఎస్సై వీరేందర్ మాట్లాడుతూ సమాజాన్ని పట్టిపీడిస్తున్న గంజాయి, డ్రగ్స్, బెట్టింగ్ యాప్‌ల వల్ల యువత తప్పుదారులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వీటికి వ్యతిరేకంగా విద్యార్థులు, యువత కట్టుదిట్టంగా పోరాడాలని సూచించారు. డివైఎఫ్ఐ మండల కార్యదర్శి గడ్డం విజయ్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో భాగంగా జిల్లావ్యాప్తంగా సెమినార్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, చర్చా వేదికలు, యువజన ర్యాలీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. డ్రగ్స్, గంజాయి, బెట్టింగ్ యాప్‌ల వ్యతిరేకంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయడానికి విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ మండల సహాయ కార్యదర్శి అజయ్ గోపి, నాయకులు నందకిషోర్, ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యుడు వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *