పయనించే సూర్యుడు, కోరుట్ల మార్చి 18 కట్టుకున్న భర్త గర్భవతి అయిన భార్యను హత్య చేశాడు. ఈ షాకింగ్ ఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని మాదాపూర్ గ్రామంలో మంగళవారం రోజు చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. స్థానికంగా యూట్యూబర్ గుర్తింపు పొందిన వైష్ణవి(18) తన భర్త చేతిలోనే దారుణ హత్య కు గురైంది. సుమారు కొన్ని నెలల క్రితం చిత్తారి హరిబాబు అనే యువకుడిని వైష్ణవి ప్రేమ వివాహం చేసుకుంది. వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా చిన్నపాటి మనస్పర్థలు వస్తున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి దంపతుల మధ్య గొడవ జరగగా, అది కాస్తా తీవ్రంగా మారినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో నిందితుడు మంగళవారం ఉదయం సుమారు నాలుగు గంటల నుండి ఐదు గంటల మధ్య హరిబాబు ఆగ్రహంతో ఊగిపోయి, గర్భిణి అని కూడా చూడకుండా తన భార్య వైష్ణవి పై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేయడంతో.. కడుపులో ఉన్న బిడ్డతో సహా వైష్ణవి ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. హంతకుడైన భర్త ఇంటి నుండి సుమారు 5 గంటల 30 నిమిషాలకు వెళ్లిపోయినట్లు సమాచారం.ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. తమ కుమార్తెను హరిబాబు, అతని తల్లిదండ్రులు నిరంతరం వేధించేవారని, ఇప్పుడు పక్కా పథకం ప్రకారమే హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.ఇదిలా ఉంటే నిందితులకు ఉరిశిక్ష పడే వరకు తాము వదిలిపెట్టమని, లేదంటే తామే వారిని చంపేస్తామంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మాదాపూర్ గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణ నెలకొనగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు మోహరించారు.