ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత విద్యుత్ మీటర్లు, స్తంభాల ఏర్పాటు చేయాలి

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ మార్చి 19 మామిడిపెల్లి లక్ష్మణ్ జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని మైతాపూర్ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయి. మొత్తం 45 ఇళ్లలో సుమారు 30 ఇళ్లు వివిధ దశల్లో పూర్తి కావస్తున్నాయి. ఈ నేపథ్యంలో లబ్ధిదారులు విద్యుత్ సదుపాయం కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇళ్ల నిర్మాణం పూర్తవుతున్నప్పటికీ, ఆయా ఇళ్ల వరకు విద్యుత్ స్తంభాలు లేకపోవడం, మీటర్ల లభ్యత లేకపోవడం వల్ల నివాసానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో గ్రామ ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చారు. ఈ రోజు గ్రామ 8వ వార్డు సభ్యులు బుస గంగా మల్లయ్య యాదవ్, 3వ వార్డు సభ్యురాలు అనుమల్ల రమ సత్యనారాయణ కలిసి రాయికల్ విద్యుత్ శాఖ ఎఈ నవీన్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఉచితంగా విద్యుత్ మీటర్లు అందజేయాలని, ప్రతి ఇంటి వరకు విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి, వెంటనే వైరింగ్ పనులు చేపట్టాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో అనుమల్ల సత్యనారాయణ పాల్గొన్నారు.