కుంట కట్టపై అక్రమాలు – బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్

పయనించే సూర్యుడు మార్చి 19 నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి రిపోర్టర్ బిజినపల్లి మండల కేంద్రంలోని గ్రామ శివారులో ఉన్న సర్వే నంబర్ 458లోని జుట్టయ్య కుంట కట్టను కొందరు అక్రమంగా తొలగిస్తూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని, వారిపై ప్రభుత్వం తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బిజినపల్లి మండల మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు తుమ్మల అల్లోజి డిమాండ్ చేశారు. బుధవారం ఈ విషయమై ఆయన డిప్యూటీ తహసీల్దార్ రవికుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఇదే అంశంపై ఇప్పటికే అదనపు కలెక్టర్‌తో పాటు ఇరిగేషన్ ఈఈలకు కూడా వినతిపత్రాలు అందజేసినట్లు తెలిపారు. సర్వే నంబర్ 458లో ఉన్న ఈ కుంట విస్తీర్ణం సుమారు 17 ఎకరాలు 10 కుంటలుగా ఉందని, దీనికి అనుసంధానంగా మూడు గొలుసుకట్టు చెరువులు కూడా ఉన్నాయని వివరించారు. ఈ కుంటకు అక్రమాలు జరిగితే మత్స్యకారులకు తీవ్రమైన నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో 1996లో వరదల కారణంగా కుంట కట్ట దెబ్బతినడంతో ప్రభుత్వ నిధులతో మరమ్మత్తులు చేపట్టినట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ఆక్రమణలను అరికట్టాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు మహేశ్వర్ రెడ్డి, సుదర్శన్, బాలమసయ్య, శ్రీశైలం, శివ, గఫూర్ తదితరులు పాల్గొన్నారు.