గిరిజన అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి – అల్లూరి జిల్లా గిరిజన సమస్యలను వివరించిన రాష్ట్ర గిరిజన సహకార సంస్థ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్

పయనించే సూర్యుడు మార్చి తేదీ 19 రూలర్ ప్రతినిధి బాసు అమరావతి: అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరిజనులు ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యలు, గిరిజన సంక్షేమం, గిరిజన సహకార సంస్థ (జీసీసీ) బలోపేతం మరియు అభివృద్ధికి సంబంధించిన అంశాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర గిరిజన సహకార సంస్థ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ అమరావతి సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల కొరత, రహదారులు, తాగునీరు, వైద్యసేవలు, విద్యా సౌకర్యాల లోపం వంటి సమస్యలను ముఖ్యమంత్రికి వివరించారు. అలాగే గిరిజన రైతులు పంటలకు సరైన ధరలు అందక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలియజేసి, వారికి సరైన మద్దతు ధరలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గిరిజన మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడం, స్వయం ఉపాధి అవకాశాలు పెంచడం, అటవీ ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయడం అత్యవసరమని కిడారి శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు. జీసీసీ ద్వారా గిరిజనులకు స్థిరమైన ఆదాయం వచ్చేలా కొత్త పథకాలు తీసుకురావాలని, కొనుగోలు కేంద్రాలను విస్తరించి మధ్యవర్తుల సమస్యను తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేసినట్లు కిడారి శ్రావణ్ కుమార్ తెలిపారు. గిరిజన సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇప్పటికే అమలులో ఉన్న పథకాలతో పాటు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపారు. జీసీసీ కార్యకలాపాలను ఆధునీకరించి గిరిజన ఉత్పత్తులకు జాతీయ స్థాయి మార్కెట్ కల్పించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని, గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు పెంచే కార్యక్రమాలు కూడా తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో గిరిజనుల జీవన ప్రమాణాలు గణనీయంగా మెరుగుపడేలా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని ఈ సందర్భంగా కిడారి శ్రావణ్ కుమార్ ముఖ్యమంత్రిని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *