చినుకు పడితే ‘చిత్తడే’.. చెరువులా మారిన పెద్దరేవల్లి ఎస్సీ కాలనీ

★ రైస్ మిల్ యజమాని స్వార్థం..కాలనీ వాసులకు నరకం ★ నిలిచిన వర్షపు నీరు వల్ల కూలే స్థితిలో ఇళ్లు మణికంఠ రైస్ మిల్‌పై చర్యలు తీసుకోవాలి _ కాలనీ వాసులు

పయనించే సూర్యుడు మార్చి 19, మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ నరిగె కళాశేఖర్: రాత్రి కురిసిన భారీ వర్షానికి పెద్దరేవల్లి గ్రామంలోని మూడో వార్డు (ఎస్సీ కాలనీ) అధ్వానంగా తయారైంది. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, వర్షపు నీరు వెళ్లే దారిని మూసివేయడంతో కాలనీ మొత్తం ఒక చెరువులా మారింది. మోకాళ్ల లోతు నీరు నిలవడంతో స్థానికులు బయటకు రావడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలోని మణికంఠ రైస్ మిల్ యజమాన్యం తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు పక్కన నూతన నిర్మాణం చేపడుతున్న క్రమంలో, గతంలో నీరు వెళ్లే కల్వర్టును పూర్తిగా బ్లాక్ చేశారని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. దీనివల్ల వర్షపు నీరు సహజంగా వెళ్లాల్సిన దారి లేక నేరుగా ఎస్సీ కాలనీలోకి వచ్చి చేరుతోంది. దీనివల్ల ఇళ్ల చుట్టూ నీరు చేరడంతో మట్టి ఇళ్లు కూలిపోయే ప్రమాదం ఉందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిల్వ ఉన్న నీటి కారణంగా దోమలు, ఈగలు పెరిగి రోగాల బారిన పడే అవకాశం ఉందని భయాందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి మణికంఠ రైస్ మిల్ యజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుని, మూసుకుపోయిన కల్వర్టును తెరిపించి, మా కాలనీకి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానిక నేత కొండకళ్ళ విష్ణువర్ధన్ డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పూర్తిస్థాయిలో పరిశీలన జరిపి బాధితులకు సరైనా న్యాయం చేయాలని కోరుతున్నారు.