నక్కవానిగూడెం ప్రాథమిక పాఠశాలలో ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

పయనించే సూర్యుడు, మార్చ్ 19, బచ్చన్నపేట మండల ప్రతినిధి: నీల పవన్. మండలంలోని నక్కవానిగూడెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవాన్ని విద్యార్థులు ఉత్సాహంగా, ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులు, అధికారుల పాత్రలు పోషించి అందరినీ అలరించారు. విద్యార్థుల్లో చిన్నప్పటి నుంచే నాయకత్వ లక్షణాలు, బాధ్యతా భావం మరియు నిర్వహణా నైపుణ్యాలను పెంపొందించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు మడూరి వెంకటేశ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ స్వయం పరిపాలన దినోత్సవంలో విద్యార్థులు వివిధ బాధ్యతలను స్వీకరించి అద్భుతంగా తమ పాత్రలను పోషించారు. డీఈవోగా చంద్రశేఖర్, ప్రధానోపాధ్యాయురాలిగా మనుశ్రీ, ఉపాధ్యాయులుగా త్రివేణి, శ్రీవరుణ్, రాకేష్, అలాగే అంగన్వాడీ టీచర్లుగా నీహారిక, ధనుశ్రీ వ్యవహరించి మెప్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మడూరి వెంకటేశ్ , అంగన్వాడీ టీచర్ నాగమణి, సీఆర్పీ సుధాకర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.