పదవి ముఖ్యం కాదు, ప్రజల మన్నన ముఖ్యం.

* మాజీ కౌన్సిలర్ సర్వాన గీతారవి భావోద్వేగ ప్రకటన – ఐదేళ్ల సేవా ప్రయాణానికి ముగింపు,

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 19 పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్. పలాస కాశీబుగ్గ రాజకీయాల్లో సేవే లక్ష్యంగా ముందుకు సాగిన 10వ వార్డు మాజీ కౌన్సిలర్ సర్వాన గీతారవి తన పదవీకాలం ముగిసిన సందర్భంగా భావోద్వేగ ప్రకటన చేశారు. ఐదేళ్లపాటు ప్రజలతో కలిసి నడిచిన తన సేవా ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ, వార్డు ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.తనను కౌన్సిలర్‌గా గుర్తించి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.అలాగే తనపై నమ్మకంతో అత్యధిక మెజారిటీతో గెలిపించిన 10వ వార్డు ప్రజలకు జీవితాంతం ఋణపడి ఉంటానని పేర్కొన్నారు.మునిసిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి ప్రజల మనిషిగా సేవలు అందించినట్లు తెలిపారు. నామినేషన్ ఘట్టం అనంతరం ఎన్నికలు జరగాల్సిన సమయంలో కరోనా మహమ్మారి కారణంగా ఎన్నికలు నిలిచిపోవడం, ప్రజల సేవలు కూడా ఆగిపోవడం వంటి పరిస్థితులు ఎదురయ్యాయని చెప్పారు. అటువంటి క్లిష్ట సమయంలో నిరుపేదలకు స్వయంగా వంట చేసి ఇంటింటికి ఆహారం అందించిన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు.వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. పొందర వీధిలో స్వంత ఖర్చులతో కల్వర్టులు నిర్మించడం, జక్కర గుండం అభివృద్ధి చేయడం, మునిసిపల్ సాధారణ నిధులతో పలు ప్రాంతాల్లో పవర్ బోర్లు ఏర్పాటు చేసి తాగునీటి సమస్యను పరిష్కరించడం వంటి పనులను చేశారు. అలాగే డెంకివీధి, పారసాంబ దళితవీధిలో పాడైపోయిన పాత బావులను పునరుద్ధరించి వినియోగంలోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.తుప్పు పట్టిన విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్త పోల్స్ ఏర్పాటు, దశాబ్దాలుగా ఉన్న రహదారి సమస్యలకు పరిష్కారం, పారసాంబ కోనేరు పూడిక తొలగింపు, స్నానాల రేవుల నిర్మాణం వంటి పనులు చేపట్టినట్లు చెప్పారు. హుద్ హుద్, తిత్లీ తుఫాన్ల వల్ల ఇళ్లు కోల్పోయిన బాధితులకు ప్రభుత్వ సహాయం అందేలా కృషి చేసినట్లు వివరించారు. వార్డులో ఇల్లు లేని వారికి జగనన్న కాలనీల్లో ఇళ్లు కల్పించడం, నవరత్నాల పథకాలను అర్హులైన వారికి అందించడం వంటి సంక్షేమ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసినట్లు పేర్కొన్నారు.రాజకీయాలకు అతీతంగా ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేశామని తెలిపారు.తన వల్ల ఎవరికైనా ఇబ్బందులు కలిగితే పెద్ద మనసుతో క్షమించాలని వార్డు ప్రజలను కోరారు. ఇకపై పదవి లేకపోయినా ప్రజల సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.చివరిగా మరోసారి వార్డు ప్రజలకు, మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజుకు మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు కు మున్సిపల్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *