బచ్చన్నపేటలో హోటళ్లపై సివిల్ సప్లై అధికారుల మెరుపు దాడులు

డొమెస్టిక్ సిలిండర్లు సీజ్

పయనించే సూర్యుడు, మార్చ్ 19, ​బచ్చన్నపేట మండల ప్రతినిధి: నీల పవన్. హోటళ్లు,దాబాల్లో నిబంధనలకు విరుద్ధంగా గృహ వినియోగ (డొమెస్టిక్) గ్యాస్ సిలిండర్లను వాడుతున్న వారిపై సివిల్ సప్లై అధికారులు కొరడా ఝుళిపించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం బచ్చన్నపేట మండల కేంద్రంలోని పలు వ్యాపార సంస్థల్లో అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కమర్షియల్ అవసరాల కోసం గృహ వినియోగ సిలిండర్లను వినియోగిస్తున్నట్లు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు.జిల్లా సివిల్ సప్లై అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ సామాన్యులకు అందాల్సిన రాయితీ సిలిండర్లను వ్యాపారాలకు వాడటం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు.(Essential Commodities Act, 1955 ప్రకారం) నిబంధనలు ఉల్లంఘిస్తే 3 నెలల నుండి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని హెచ్చరించారు. జరిమానాతో పాటు సదరు యజమానుల గ్యాస్ కనెక్షన్లను శాశ్వతంగా రద్దు చేస్తామని అధికారులు తెలిపారు.​ఈ దాడుల్లో మండల ఆర్ ఐ వంశీకృష్ణ, జీపీఓ రామకృష్ణ సిబ్బంది సంపత్, ఐశ్వర్య ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధి పూర్ణచందర్ తదితరులు పాల్గొన్నారు.