పయనించే సూర్యుడు, మార్చి 19 – నాగర్‌కర్నూల్ జిల్లా, బిజినపల్లి (రిపోర్టర్: కే. శ్రావణ్ కుమార్) నాగర్‌కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలంలోని మహాదేవునిపేట గ్రామంలో గ్రామ పెద్దల ఆధ్వర్యంలో రోడ్డు భద్రత, గంజాయి, మాదకద్రవ్యాలు (డ్రగ్స్) మూఢనమ్మకాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక చైతన్య సదస్సు మరియు కళాప్రదర్శనలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పోలీస్ అధికారులు అయిన డీఎస్పీ, సీఐ, మండల ఎస్సైలు హాజరై యువతకు విలువైన సూచనలు అందించారు. సమాజంలో పెరుగుతున్న మాదకద్రవ్యాల వినియోగం తీవ్రమైన సమస్యగా మారుతోందని, యువత వాటికి దూరంగా ఉండాలని స్పష్టంగా హెచ్చరించారు. ఈ సందర్భంగా ప్రజాకవి జయప్రకాశ్ కళాబృందం ఆటపాటల రూపంలో గంజాయి, డ్రగ్స్ మూఢనమ్మకాల దుష్ప్రభావాలను ప్రజలకు సులభంగా అర్థమయ్యే విధంగా వినిపించారు. వారి ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా, గ్రామ ప్రజల్లో చైతన్యాన్ని కలిగించాయి. నాగర్‌కర్నూల్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో, మహాదేవునిపేట గ్రామ సర్పంచ్ సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. కార్యక్రమం అనంతరం కళాకారులను పోలీస్ అధికారులు గ్రామ సర్పంచ్ ఆంజనేయులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కవి గాయకులు కాశి దాసు, డప్పు నరేందర్, బోనాసి రాజు, విజయ్‌కాంత్, డప్పు లక్ష్మణ్, శ్రావణ్ కుమార్, శ్రీశైలం, రిథమ్ ప్లేయర్ సతీష్, చందు జాంగిర్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.