రాజకీయాలలో ఎస్సీలకు చోటు ఏది..

* గత రాజకీయ నాయకుల వివక్షతతో ఎస్సీలకు మొండి చేయి.. * అధికారం సామాజిక మార్పుకు ఒక సాధనం" అన్న అంబేడ్కర్ ఆశయాలు..

పయనించే సూర్యుడు మార్చి 19, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) దేశవ్యాప్తంగా అట్టడుగు వర్గాలకు రాజకీయ గొంతుకను ప్రసాదించిన రాజ్యాంగం, కాకినాడ రూరల్ మండలంలో మాత్రం కేవలం కాగితాలకే పరిమితమవుతోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నియోజకవర్గ రాజకీయ ముఖచిత్రంలో నిర్ణయాత్మక శక్తిగా ఉన్న ఎస్సీ సామాజికవర్గానికి దశాబ్దాలుగా దక్కాల్సిన ప్రాతినిధ్యం అందని ద్రాక్షగానే మిగిలిపోవడం ఇక్కడి విషాదకర రాజకీయ వాస్తవం. కాకినాడ రూరల్ మండలం ఏర్పాటైన నాటి నుండి నేటి వరకు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల చరిత్రను ఒకసారి పరిశీలిస్తే, సామాజిక న్యాయం అనే పదం ఇక్కడ ఎక్కడా కనిపించదు. మండల పరిషత్ అధ్యక్ష పదవి (ఎంపీపీ) కావొచ్చు, జిల్లా పరిషత్ ప్రాంతీయ నియోజకవర్గ సభ్యత్వ (జెడ్‌పీటీసీ) స్థానం కావొచ్చు.. రిజర్వేషన్ల చక్రం తిరుగుతున్నా, అది ఎందుకో ఎస్సీల దరిదాపుల్లోకి రాకపోవడం గమనార్హం. గతంలో ఎంపీపీలుగా పనిచేసిన కొప్పిశెట్టి రవీంద్ర, వివై దాసు, గుబ్బల వెంకటేశ్వరరావు, పుల్లా సుధాచందు, గోపిశెట్టి పద్మజా బాబ్జి వంటి వారు బీసీ లేదా ఓసీ సామాజికవర్గాలకు చెందిన వారే. అలాగే జెడ్‌పీటీసీ స్థానాల్లోనూ అత్తిలి సీతారామస్వామి, నులుకుర్తి వెంకటేశ్వరరావు, పెద్దాడ పద్మావతి, కాకరపల్లి సత్యవతి, నురుకుర్తి రామకృష్ణ వంటి వారికే అవకాశం దక్కింది తప్ప, ఎస్సీలకు మాత్రం మొండి చేయే మిగిలింది. సుమారు 22 వేల పైచిలుకు ఓట్లు కలిగి ఉండి, ఎన్నికల్లో గెలుపోటములను శాసించే స్థాయిలో ఉన్న ఎస్సీ వర్గాలకు ఇప్పటివరకు రిజర్వేషన్ కేటాయింపులో మొండిచేయి ఎదురవ్వడం వెనుక ఏ శక్తులు పనిచేస్తున్నాయన్నది మిస్టరీగా మారింది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో రోటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు అమలవుతున్నప్పటికీ, కాకినాడ రూరల్‌లో మాత్రం ఆ లెక్కలు ఎందుకు తారుమారవుతున్నాయో ఎవరికీ అర్థం కావడం లేదు. రాజకీయ పార్టీలకు జెండాలు మోయడానికి, నాయకుల వెనుక ఊడిగం చేయడానికి మాత్రమే తాము పరిమితమా? అని విద్యావంతులైన ఎస్సీ యువత నిలదీస్తోంది. అన్ని రాజకీయ పార్టీల్లోనూ క్రియాశీలకంగా పనిచేస్తున్న దళిత నేతలు ఉన్నప్పటికీ, వారికి నిర్ణయాత్మక పదవులను కట్టబెట్టడంలో అధిష్టానాలు వెనకడుగు వేయడం వారి రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంది. ఎన్నికల కమిషన్ సైతం క్షేత్రస్థాయి గణాంకాలను పట్టించుకోకుండా ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గి రిజర్వేషన్లను ప్రకటిస్తోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చదువుకున్న యువత, రాజకీయాల్లో రాణించాలనుకునే ఆశావహులు ఈ అన్యాయాన్ని చూసి నిరాశ చెందుతున్నారు. ఒక్కసారి జెడ్‌పీటీసీ లేదా ఎంపీపీగా అవకాశం దక్కి ఉంటే, ఆ సామాజిక వర్గం నుండి ఎంతో మంది నాయకులు ఎదిగేవారు. ఇప్పుడైనా ఈ ‘రిజర్వేషన్ల అన్యాయం’పై పాలకులు స్పందిస్తారా? అందరికీ సమన్యాయం అందిస్తామని చెబుతున్న కూటమి ప్రభుత్వం, ఈ వింత రాజకీయ సంప్రదాయానికి స్వస్తి పలుకుతుందా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం అందరికీ సమాన అవకాశాలను కల్పిస్తుంటే, కాకినాడ రూరల్‌లో మాత్రం అది ఎందుకు అపహాస్యమవుతోందో సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికారులపై, రాజకీయ నాయకులపై ఉంది. ఈ సారైనా ఎస్సీల రాజకీయ కల నెరవేరుతుందో లేక మళ్ళీ వారంతా కేవలం ‘ఓటు బ్యాంకు’గానే మిగిలిపోతారో వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *