రాయికల్ విశ్వశాంతి పాఠశాలలో ఘనంగా ముందస్తు ఉగాది వేడుకలు

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ మార్చి 19 మామిడిపెల్లి లక్ష్మణ్ రాయికల్ పట్టణంలోని విశ్వశాంతి పాఠశాలలో ఉగాది పండుగను ముందస్తుగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినీ, విద్యార్థులు ఉగాది పచ్చడిని స్వయంగా తయారు చేసి పాఠశాలలోని తమ స్నేహితులందరికీ పంచడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ మచ్చ గంగాధర్ మాట్లాడుతూ ఉగాది తెలుగువారి తొలి పండుగగా విశేష ప్రాధాన్యం కలిగి ఉందన్నారు. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు సృష్టి ఆరంభమైందనే నమ్మకంతో ఈ పండుగను జరుపుకుంటారని తెలిపారు. ఉగాది కొత్త సంవత్సరానికి, ఆశలకు, నూతనోత్సాహానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఉగాది పచ్చడిలో ఉండే షడ్రుచులు మన జీవితంలోని కష్టసుఖాలను సూచిస్తాయని ఆయన వివరించారు. బెల్లం తీపి సంతోషాన్ని, వేపపువ్వు చేదు బాధను, మిరియాల కారం ఆగ్రహాన్ని, ఉప్పు భయాన్ని, పులుపు వికారం, వగరు ఆశ్చర్యాన్ని సూచిస్తాయని చెప్పారు. ఈ ఆరు రుచులు మన జీవితాన్ని సమతుల్యంగా స్వీకరించాలనే సందేశాన్ని ఇస్తాయని పేర్కొన్నారు. అలాగే “ఉగ” అంటే నక్షత్ర గమనం, “ఆది” అంటే ఆరంభం అని, నక్షత్ర గమనానికి ఆది కాబట్టి దీనిని ఉగాది అని పిలుస్తారని వివరించారు. ఈ రోజున ఇళ్లను శుభ్రపరచి, ముగ్గులతో, మామిడి తోరణాలతో అలంకరించడం, కొత్త బట్టలు ధరించడం, గుడికి వెళ్లడం వంటి సంప్రదాయాలు పాటిస్తామని తెలిపారు. పంచాంగ శ్రవణం వినడం ద్వారా వచ్చే ఏడాది పరిస్థితులను అంచనా వేసుకోవచ్చని చెప్పారు. ఈ ఉగాది సందర్భంగా పాత బాధలను మర్చిపోయి కొత్త ఆశలతో ముందుకు సాగాలని, అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు మచ్చ లలిత, విద్యాన్వేష్, ఉపాధ్యాయులు గట్టుపెల్లి మహేష్, రంజిత్, వెంకటేష్, అప్సర్, షారు, రజిత, సంజన, కట్ట మంజుల, శ్రీజ, వాసరి స్రవంతి, సౌజన్య, నిహారిక, అనూష, మమత, సాయి హర్ష తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *