

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ మార్చి 20 మామిడిపెల్లి లక్ష్మణ్ ఉగాది వంటి హిందూ పండుగలు ఖగోళ శాస్త్రం, ప్రకృతి మార్పులు, ధర్మం అధర్మంపై సాధించిన విజయానికి ప్రతీకలని, జాతీయ సమైక్యత, విశ్వగురు భారత్ సంఘ ధ్యేయమని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ జిల్లా కార్యవాహ్ గొల్కొండ నాగరాజు పేర్కొన్నారు. గురువారం రాయికల్ లో జరిగిన సంఘ ఉగాది ఉత్సవానికి ముఖ్య వక్తగా పాల్గొని ఆయన మాట్లాడుతూ ఉగాది కేవలం కొత్త సంవత్సర ప్రారంభమే కాకుండా, ప్రకృతి పునరుత్థానం సాంస్కృతిక పునరుజ్జీవానికి సంకేతమని ఆయన అన్నారు. హిందువుల అనైక్యత కారణంగా సనాతన ధర్మం గతంలో పతన దిశగా వెళ్లిందని, విద్యా, సాంస్కృతిక విభజనలు దేశాన్ని బలహీనపరిచాయని పేర్కొన్నారు. 1947లో వచ్చిన స్వాతంత్ర్యం రాజకీయ పరమైనదే గాని, సాంస్కృతిక స్వాతంత్ర్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితులను ముందుగానే గ్రహించిన ఆద్య సర్ సంఘచాలక్ పరమపూజనీయ డాక్టర్ కేశవ్ బాలిరామ్ హెడ్గేవార్ (డాక్టర్ జీ) 1925లో తన 36 ఏళ్ల వయసులో సంఘాన్ని స్థాపించి, జాతీయ భావాలు కలిగిన వ్యక్తుల నిర్మాణమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగారని, వారి జీవిత కాలంలో చిన్న భారతదేశాన్ని చూసారని తెలిపారు. సంఘం నిత్యశాఖల ద్వారా “ఈ భూమి నాది – నేను ఈ భూమి పుత్రుడను” అనే దేశభక్తి భావనను పెంపొందిస్తోందన్నారు. దేశ చరిత్రలో సంఘం కీలక పాత్ర పోషించిందని, కాశ్మీర్ విలీన సమయంలో ద్వితీయ సర్ సంఘచాలక్ గురూజీ హరిసింగ్‌తో చర్చలు జరిపి దేశ సమగ్రతకు తోడ్పడిన విషయాన్ని గుర్తుచేశారు. 1962 చైనా యుద్ధ సమయంలో స్వయంసేవకులు దేశ రక్షణలో పాల్గొన్నారని, ఆ తరువాత 1963 గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొనేందుకు అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ సంఘాన్ని ఆహ్వానించారని, 3 వేల మంది స్వయం సేవకులు ఘోష్ తో పరేడ్ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. భారత్‌ను శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దడంలో డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం చేసిన సేవలను కొనియాడుతూ, దేశం ఆయనకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని అన్నారు. ఆధునిక భారత సైనిక శక్తి ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందని, ఆపరేషన్ సింధూర్ కేవలం నాలుగు రోజుల యుద్దంతో భారతదేశం శక్తి ప్రపంచానికి తెలిసిందని, నిర్దారిత తీవ్రవాద స్థావరాలపై దాడి చేసిందని, బ్రహ్మోస్, అగ్ని వంటి క్షిపణుల పట్ల ప్రపంచ దేశాలు ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు. 2014 తరువాత దేశంలో నిజమైన సాంస్కృతిక స్వాతంత్ర్యం, జాతీయ గౌరవం పెరిగిందని విదేశీ పరిశీలకులు, పత్రికలు కూడా గుర్తించారని చెప్పారు. గ్రామాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, దేవాలయ నిర్మాణాలు మంచివే అయినప్పటికీ, వాటితో పాటు హిందువుల ఐక్యత, దేశభక్తి అత్యంత అవసరమని పిలుపునిచ్చారు. సంఘ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ప్రతి స్వయంసేవక్ కార్యవిస్తరణలో మరింత చురుకుగా పాల్గొని శక్తివంతమైన, దృఢమైన భారత నిర్మాణానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఖండ కార్యవాహ్ వేల్పుల స్వామి యాదవ్, నగర కార్యవాహ్ చెంగళి మహేష్, కుర్మ మల్లారెడ్డి, తోపారపు రవీందర్, బోడ్గం మోహన్ జీ, ఎద్దండి ముత్యంపు రాజు, డాక్టర్ తురగ రాజరెడ్డి, బొమ్మకంటి రాంగోపాల్, గాజెంగి అశోక్, సదుల అశోక్, చంద రమేష్, మామిడాల లక్ష్మీనారాయణ, కుర్మ చిన్న మల్లారెడ్డి, పటేల్ రాము, శంకర్ జీ, కూనారపు భూమేష్, పుర్రె శ్రీధర్, భూమాగౌడ్ తదితరులతో పాటు సుమారు 110 మంది స్వయంసేవకులు పాల్గొన్నారు.