అప్పుల బాధ భరించలేక కిరాణా వ్యాపారి ఆత్మహత్య

పయనించే సూర్యుడు, కోరుట్ల మార్చి 21 కోరుట్ల పట్టణంలోని రాంనగర్ కి చెందిన కిరాణా వ్యాపారి అప్పుల బాధను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా విషాదాన్ని కలిగించింది.వివరాల్లోకి వెళితే… రాంనగర్ చెందిన వీరమల్లి ప్రసాద్ (48) డాగ్ బంగ్లా సమీపంలో కిరాణా దుకాణం నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతనికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తె ఎర్రంశెట్టి రాజ్యలక్ష్మి వివాహం ఐదు సంవత్సరాల క్రితం జరగగా, ఆమె కుమారుడు శివ నరేంద్ర (3) బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. మనవడి చికిత్స కోసం ప్రసాద్ భారీగా అప్పులు చేసి చికిత్స చేయించగా, దాదాపు రూ.45 లక్షల వరకు అప్పులు అయ్యాయి. అప్పులు తీర్చేందుకు రెండు నెలల క్రితం ఇల్లు కూడా అమ్మినప్పటికీ అప్పు పూర్తిగా తీరలేదు. దీంతో గత కొన్ని రోజులుగా తీవ్ర మనస్తాపానికి గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వెంటనే స్థానికుల సహాయంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అప్పుల బాధను తట్టుకోలేక పురుగుమందు సేవించి ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానం వ్యక్తమవుతోంది. మృతుడి భార్య వీరమల్లి కావ్య (38) ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *