
పయనించే సూర్యుడు మార్చి 21 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) చేజర్ల మండలం మడపల్లి గ్రామంలో ఒక చిన్న సహాయం ఎంత పెద్ద స్ఫూర్తిగా మారుతుందో చూపించిన హృద్యమైన ఘటన చోటుచేసుకుంది.ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆత్మకూరుకు చెందిన కంచి పరమేశ్వర్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అధినేత కంది పరమేశ్వర్ రెడ్డి బుధవారం గిరిజన జంటకు పెళ్లికానుకగా చేయూతనందించారు.శుక్రవారం వివాహ బంధంతో ఒక్కటవబోతున్న ఎస్టీ కాలనీకి చెందిన ధనం శివ, మల్లిక లక్ష్మీ ప్రసన్నలకు గురువారం సాయంత్రం ఆయన స్వయంగా వెళ్లి రూ.10,000 నగదు సహాయం తో పాటు కొత్త దుస్తులను అందజేశారు. ఈ సందర్భంగా జంటను ఆశీర్వదిస్తూ వారి జీవితంలో ఆనందం, అభివృద్ధి నిండాలని ఆకాంక్షించారు.ఈ సహాయం కేవలం ఆర్థిక పరిమితిలోనే కాకుండా, సమాజానికి ఒక గొప్ప సందేశాన్ని అందించింది.మన చేతనైనంత చేయూత అవసరంలో ఉన్న వారికి అందించాలి అనే భావనను బలంగా చాటి చెప్పింది.ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, ఆత్మకూరు నియోజకవర్గంలో గిరిజనులు ఎవరైనా వివాహం చేసుకునే ముందు సమాచారం ఇస్తే, తమ వంతు సహాయంగా పెళ్లికానుక అందజేస్తానని హామీ ఇచ్చారు. సమాజంలో వెనుకబడిన వర్గాల అభివృద్ధి తన ముఖ్య లక్ష్యమని తెలిపారు.అలాగే, తమ ట్రస్ట్ సేవలు వివాహ సహాయం వరకే పరిమితం కాకుండా అనేక రంగాల్లో కొనసాగుతున్నాయని వివరించారు. గత మూడు సంవత్సరాలుగా ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నిత్య అన్నదానం నిర్వహిస్తూ రోగులకు, వారి కుటుంబాలకు ఆహారం అందిస్తున్నామని చెప్పారు. చదువులో ప్రతిభ కనబరచే పదో తరగతి విద్యార్థులకు ప్రోత్సాహకంగా నగదు బహుమతులు ఇస్తున్నామని, అలాగే మృతి చెందిన కుటుంబాలకు అంత్యక్రియల కోసం రూ.10,000 ఆర్థిక సహాయం అందజేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో బీజేపీ, నాయకులు బత్తల కృష్ణయ్య. గుండాల భాస్కర్ రెడ్డి. టిడిపి నాయకులు, ట్రస్ట్ ప్రతినిధులు, గ్రామస్తులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.